
టెస్లా కొత్త మోడల్ వై ఈవీని ఇటీవలే భారత్‌లో ప్రవేశపెట్టింది. దీని ధరను రూ.61 లక్షలుగా నిర్ణయించింది. టెస్లా వ్యాపారం సాగిస్తున్న ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ధరలు అధికంగా ఉన్నాయనే వాదనలున్నాయి. అయితే అందుకు నిబంధనల ప్రకారం ప్రభుత్వం విధిస్తున్న ట్యాక్స్‌లు, కంపెనీ మార్జిన్లు, ఉత్పత్తి వ్యయం అంతా తోడైందని నిపుణులు చెబుతున్నారు.
ఆటోమొబైల్ విశ్లేషకులు సంజయ్ లింక్డ్ఇన్ పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం..‘టెస్లా మీ నిజమైన కొనుగోలు కారు కాదు. ఇది ఒక టాక్స్ స్లిప్. ఇదే మోడల్ వై అమెరికాలో దాదాపు రూ.32 లక్షలకు అమ్ముడవుతుండగా, భారతీయ కొనుగోలుదారులు దాదాపు రెట్టింపు వెచ్చిస్తున్నారు. అందులో 28% జీఎస్టీ, లార్జ్ వాహనాలకు 22% పరిహార సెస్, 10% రహదారి పన్ను, బీమాపై 18% జీఎస్టీ, దిగుమతి సుంకాలు, షిప్పింగ్, రిజిస్ట్రేషన్ ఫీజులున్నాయి’ అన్నారు.
ఇదీ చదవండి: ఎరువుల కోసం రైతన్న పడిగాపులు
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని మేకర్ మ్యాక్సిటీ మాల్‌లో టెస్లా తన మొదటి షోరూమ్‌ను మంగళవారం ప్రారంభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ షోరూమ్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. భారత్ ఇప్పటికే ప్రకటించిన ఈవీ పాలసీ ప్రకారం దిగుమతి సుంకాల తగ్గింపు, ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ప్రోత్సాహకాలు అందించడం వంటివి టెస్లాకు భవిష్యత్తులో మరింత మద్దతు ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వ్యక్తిగతంగా సమావేశం అయ్యారు. అనంతరం మోదీ, ఎలాన్ మస్క్ ఏప్రిల్‌లో ఫోన్ కాల్‌లో టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో సాధ్యాసాధ్యాలపై చర్చించారు.
