హైదరాబాద్‌లో టెస్లా.. రెడీ అవుతున్న షోరూం! | tesla coming to hyderabad launch date | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో టెస్లా.. రెడీ అవుతున్న షోరూం!

May 23 2026 7:42 AM | Updated on May 23 2026 11:45 AM

tesla coming to hyderabad launch date

సాక్షి, హైదరాబాద్‌: టెస్లా.. ఎలక్ట్రిక్‌ కారు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు. ఇప్పటికే భారత్‌లో ముంబై, న్యూఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరులో ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్లను తెరిచిన టెస్లా.. హైదరాబాద్‌లోనూ అడుగు పెడుతోంది. కొండాపూర్‌లో రెండు నెలల్లో సేల్స్, సర్వీస్‌ సెంటర్‌ సిద్ధం అవుతోందని సమాచారం.

యూఎస్‌కు చెందిన ఈ సంస్థ భారత మార్కెట్‌ కోసం ప్రత్యేకంగా మోడల్‌–వై కారును ఇప్పటికే ప్రవేశపెట్టింది. ఆటోపైలెట్, ఫుల్‌ సెల్ఫ్‌–డ్రైవింగ్‌ వంటి అత్యాధునిక సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఫీచర్లు కంపెనీ కార్ల ప్రత్యేకత. టెస్లా అంటే కేవలం కార్లు మాత్రమే కాదని, ఈ సంస్థ రాకతో హైదరాబాద్‌ రియల్టీకి పెద్ద బూస్ట్‌నిస్తుందని రియల్టీ రంగ నిపుణుడు కలిశెట్టి నాయుడు ‘సాక్షి’కి తెలిపారు.

టెస్లా కార్లకు ఇక్కడి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంటుందన్నారు. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల విషయంలో బెంగళూరును బీట్‌ చేశామని, హైనకెన్, లాంజా వంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో కొలువుదీరడానికి ఇక్కడి మౌలిక వసతులు కారణమన్నారు. టాప్‌–20 ఎన్‌బీఎఫ్‌సీలు అన్నీ హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయని, ఒక్క భాగ్యనగరికే ఈ ఘనత సాధ్యమైందన్నారు.

మంత్రి శ్రీధర్‌బాబుతో టెస్లా డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ రజత్, ఇండియా జీఎం శరద్‌ అగర్వాల్‌ (ఎడమ నుంచి కుడికి) 

విస్తరణ చేపట్టండి.. 
మంత్రి శ్రీధర్‌బాబును టెస్లా బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ రజత్, ఇండియా జీఎం శరద్‌ అగర్వాల్‌ శుక్రవారం కలిశారు. హైదరాబాద్‌లో షోరూం ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. దేశంలో ప్రస్తు తం కార్ల మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల వాటా సుమారు 4 శాతం మాత్రమే ఉందని, ఈ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులకు మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, హైదరాబాద్‌ను క్లీన్‌ టెక్నాలజీ, ఆధునిక మొబిలిటీకి ప్రపంచస్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసే సంకల్పంతో ఉందని పేర్కొన్నారు.

తెలంగాణలో టెస్లా అనుబంధ పరిశ్రమల విస్తరణ అవకాశాలను పరిశీలించాలన్నారు. పరిశ్రమలు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభు త్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో ఐటీ సలహాదారు సాయికృష్ణ, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్‌ నిఖిల్‌ చక్రవర్తి, ప్రత్యేక కార్యదర్శి రఘురామశర్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement