
తెలంగాణలో వాహనాలకు ప్రీమియం నంబర్లకు సంబంధించిన నిబంధనలు మారాయి. తెలంగాణ మోటారు వాహనాల నిబంధనలు 1989లోని రూల్ 81కు సమగ్ర సవరణ చేస్తూ ప్రీమియం వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను రిజర్వ్ చేసే ఫీజు విధానం, ప్రక్రియను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇకపై రవాణా శాఖ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించరు. మాన్యువల్ జోక్యాన్ని తగ్గించడం, అవినీతిని అరికట్టడం, మొత్తం రిజర్వేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా డిజిటల్-ఓన్లీ ప్రాసెసింగ్ విధానాన్ని తీసుకుకొచ్చారు.
కొత్త అంచెల ఫీజు విధానం
సవరించిన నిబంధనల ప్రకారం నంబర్ల పాపులారిటీ, ప్రత్యేకత ఆధారంగా ఆరు అంచెల ఫీజు వ్యవస్థను ప్రవేశపెట్టారు.
టైర్ 1లో 1, 9, 9999 నంబర్లకు అత్యధికంగా రూ.1,50,000
టైర్ 2లో 99, 100, 786, 888, 999 నంబర్లకు రూ 1,00,000
టైర్ 3లో 33, 111, 555, 666, 777, 1000 నంబర్లకు రూ. 50,000
టైర్ 4లో 1234, 2023, 2525, 3333, 4444, 5555, 6666, 7777, 8888, 9090 నంబర్లకు రూ. 20,000
టైర్ 5లో 123, 143, 202, 345, 789, 987 నంబర్లకు రూ. 10,000
టైర్ 6లో ఇతర అన్ని నంబర్లకు రూ.2,000
అధిక-డిమాండ్ నంబర్లకు ఆన్‌లైన్ వేలం
అధిక-డిమాండ్ అంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే నంబర్ల కోసం ప్రభుత్వం ఆన్‌లైన్ వేలం విధానాన్ని ప్రవేశపెట్టింది. బిడ్డర్లు రెండు గంటల విండోలో పోటీపడతారు. అత్యధిక బిడ్డర్ నంబర్‌ను సొంతం చేసుకుంటారు. విఫలమైన బిడ్డర్లు చెల్లించిన ఫీజులో 10% కోల్పోతారు.
గెలిచిన బిడ్డర్ 30 రోజుల్లో వాహనాన్ని రిజిస్టర్ చేయకపోతే, రిజర్వేషన్ రద్దు చేస్తారు. అలాగే మొత్తం రుసుమును సీజ్ చేస్తారు. ఆన్‌లైన్ విధానం వల్ల అక్రమాలు తగ్గడమే కాకుండా ప్రీమియం సేవల ద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. సవరణలను ఖరారు చేయడంలో విస్తృత భాగస్వామ్యం ఉండేలా గెజిట్ వెలువడిన 15 రోజుల్లో ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం ఆహ్వానించింది.