
దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) 2025 సెప్టెంబర్ 1 నుంచి తన ఉద్యోగులకు వేతనాల పెంపును ప్రారంభించింది. మెజారిటీ సిబ్బందికి 4.5 నుంచి 7 శాతం వరకు జీతాలను పెంచినట్లు తెలుస్తోంది. అత్యుత్తమ పనితీరును కనపరించినవారికి 10 శాతం పెంచినట్లు సమాచారం. ఇంక్రిమెంట్ లెటర్లను కంపెనీ ఉద్యోగులకు అందించే ప్రక్రియను కూడా మొదలుపెట్టేసింది.
ఈ ఏడాది టీసీఎస్ తన ఉద్యోగులలో దాదాపు 80% మందికి ఇంక్రిమెంట్లు అమలు చేయనున్నట్లు గత నెలలోనే వెల్లడించింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుంచే వేతనాల పెంపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ ఆర్ధిక అనిశ్చితులు, సవాలుతో కూడిన వ్యాపార వాతావరణం కారణంగా కొంత ఆలస్యమైంది.
ఉద్యోగుల తొలగింపు
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని టీసీఎస్ వెల్లడించింది. ఉద్యోగులలో 2 శాతం.. అంటే సుమారు 12000 మందిని తొలగించే అవకాశం ఉంది. ఇది టెక్ రంగంలో ఆందోళనలు రేకెత్తించింది. ఇలాంటి సమయంలోనే కంపెనీ జీతాలను పెంచి వారికి కొంత ఉపశమనం కల్పించింది. ఉద్యోగులను తొలగించే దిశలో ఇతర టెక్ దిగ్గజాలు కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐ కారణంగా భవిష్యత్తులో మరింత మంది ఉద్యోగులు.. ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: డిజిటల్ డైమండ్.. ఈ శతాబ్దం దీనికే!.. నరేంద్ర మోదీ