
వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (యూపీఎస్‌ఆర్‌టీసీ) నుండి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ఇందులో భాగంగా యూపీఎస్‌ఆర్‌టీసీకి 1,297 బస్ ఛాసిస్‌లను కంపెనీ సరఫరా చేయనుంది. ఒక ఏడాదిలో యూపీఎస్‌ఆర్‌టీసీ నుండి ఆర్డర్ అందుకోవడం టాటా మోటార్స్‌కు ఇది మూడవది.
మొత్తం ఆర్డర్ పరిమాణం 3,500 యూనిట్లకుపైమాటే. పోటీ ఈ–బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఆర్డర్ గెలుచుకున్నట్టు టాటా మోటార్స్ తెలిపింది. పరస్పరం అంగీకరించిన నిబంధనల ప్రకారం బస్ ఛాసిస్‌లను దశలవారీగా డెలివరీ చేస్తామని వివరించింది. టాటా ఎల్‌పీవో 1618 డీజిల్ బస్ ఛాసిస్ నగరాల మధ్య, సుదూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.
‘ఈ ఆర్డర్ మెరుగైన మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో సంస్థ నిబద్ధతకు శక్తివంతమైన ధృవీకరణ. స్థిర పనితీరు, అభివృద్ధి చెందుతున్న యూపీఎస్‌ఆర్‌టీసీ రవాణా అవసరాలను తీర్చగల సామర్థ్యం.. ప్రజా రవాణా పర్యావరణ వ్యవస్థలో కంపెనీ సాంకేతిక నైపుణ్యం, విశ్వసనీయతను ప్రదర్శిస్తాయి’ అని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్, కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ హెడ్ ఎస్.ఆనంద్ తెలిపారు.
టాటా ఎల్‌పీవో 1618 బస్
టాటా ఎల్‌పీవో 1618 డీజిల్ బస్సు బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తయారైంది. ఇందులోని కమ్మిన్స్ 5.6L ఇంజన్ 180 బీహెచ్‌పీ, 675 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 6 ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఫేస్ కౌల్ రకం ఛాసిస్ 10,700 కిలోల వరకు మోయగలదు.