భారతీయ కార్మికులపై తైవాన్ నిరసన | Taiwan Faces Backlash Over Indian Worker Plan Amid Aging Crisis | Sakshi
Sakshi News home page

భారతీయ కార్మికులపై తైవాన్ నిరసన

May 4 2026 9:05 AM | Updated on May 4 2026 9:20 AM

Taiwan Faces Backlash Over Indian Worker Plan Amid Aging Crisis

వృద్ధాప్య జనాభా, తగ్గుతున్న జనన రేట్ల కారణంగా కార్మిక కొరతను అధిగమించాలని చూస్తున్న తైవాన్‌కు సొంత ప్రజల నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయి. భారతీయ కార్మికులను నియమించుకోవాలనే ప్రభుత్వ నిర్ణయంపై తైవాన్ సమాజంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో 40,000 మందికి పైగా తైవానీయులు ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు చేస్తూ భారతీయ కార్మికులను తీసుకురావాలనే ప్రణాళికను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తైవాన్ తన తయారీ రంగం, వృద్ధుల సంరక్షణ విభాగంలో నెలకొన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఫిబ్రవరి 2024లో భారతదేశంతో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. ప్రస్తుతం ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌ల మీద ఎక్కువగా ఆధారపడుతున్న తైవాన్ తన వలస కార్మిక వనరులను వైవిధ్యపరచాలని భావించింది. ఇందులో భాగంగా కేవలం 1,000 మంది కార్మికులతో ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది.

మార్చి 2026 నాటికి, తైవాన్ సుమారు 8 లక్షల మంది చట్టబద్ధమైన వలస కార్మికులకు ఆతిథ్యం ఇస్తోంది. కొత్త కార్మిక వనరులు చేకూరకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక భద్రత ప్రమాదంలో పడుతుందని కార్మిక మంత్రిత్వ శాఖ పదేపదే హెచ్చరిస్తోంది.

ప్రభుత్వ నిర్ణయానికి ప్రజా ప్రతిఘటన

తైవాన్‌ కార్మిక మంత్రి హంగ్ సున్-హాన్ ఈ ఏడాది చివరి నాటికి మొదటి విడత భారతీయ కార్మికులు వస్తారని ప్రకటించిన కొద్ది కాలంలోనే సోషల్ మీడియా వేదికగా, స్థానికంగా అక్కడి వీధుల్లో నిరసనలు భగ్గుమన్నాయి. భారతీయ పురుషులపై నెలకొన్న ప్రతికూల అభిప్రాయం, భద్రత, లింగ హింసకు సంబంధించిన భయాలు ఈ పిటిషన్‌కు దారితీశాయి. ప్రతిపక్ష కుమింటాంగ్ (కేఎంటీ) చట్టసభ సభ్యులు ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. తైవాన్ వాసులు భారతీయుల పట్ల జాత్యహంకార పూరిత వ్యాఖ్యలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో భారతీయ పురుషులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు చేయడం ఆందోళనకరంగా మారింది.

ప్రభుత్వ వాదన - వాస్తవాలు

ఈ అంశంపై ప్రజా ఆందోళనలను ఎదుర్కొంటున్నప్పటికీ కార్మిక మంత్రిత్వ శాఖ మాత్రం భారతీయ కార్మికులను లైంగిక నేరాలతో ముడిపెట్టడం నిరాధారమైనదని స్పష్టం చేసింది. గతంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వలస కార్మికులతో పోలిస్తే నేరాల రేటు స్థిరంగా ఉంటుందని, పైగా రిక్రూట్ అయ్యే ప్రతి కార్మికుడు భారత ప్రభుత్వం నుంచి మెరుగైన ప్రవర్తన సర్టిఫికేట్ (Good Conduct Certificate) సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తైవాన్ కఠినమైన స్క్రీనింగ్ ప్రక్రియలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది.

దౌత్యం వైపు అడుగులు

ప్రస్తుతానికి, తైపీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కఠినమైన పర్యవేక్షణ, భద్రతా హామీలు ఉంటేనే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని సంకేతాలు ఇచ్చింది. అయితే కార్మిక కొరతకు సామాజిక భద్రతకు మధ్య సమతుల్యత సాధించడమే ఇక్కడ అసలైన సమస్య. అంతర్జాతీయంగా ఎంతో మంది భారతీయులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నప్పటికీ ఒక దేశంపై ఏర్పడిన ప్రతికూల ముద్ర దౌత్యపరమైన సంబంధాలతోపాటు అవసరమైన ఆర్థిక అవసరాలకు కూడా ఆటంకం కలిగిస్తుందని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

ఇదీ చదవండి: ఏఐలో ఎందుకో వెనకబడ్డాం!

Advertisement
 
Advertisement
Advertisement