సిస్టమ్యాటిక్‌ విత్‌ డ్రాయల్‌ ప్లాన్‌ అంటే ఏంటి? | Systematic Withdrawal Plan Explained In Telugu | Sakshi
Sakshi News home page

సిస్టమ్యాటిక్‌ విత్‌ డ్రాయల్‌ ప్లాన్‌ అంటే ఏంటి?

Sep 5 2022 9:00 AM | Updated on Sep 5 2022 9:09 AM

Systematic Withdrawal Plan Explained In Telugu - Sakshi

నా సోదరుడు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉన్నాడు. దురదృష్టంకొద్దీ అతడు ఇటీవలే మరణించాడు. నామినీగా మా వదిన ఉండడంతో, ఆమె పేరు మీదకు ఫండ్స్‌ యూనిట్లు బదిలీ అయ్యాయి. ఇప్పు డు మా వదిన వాటిని విక్రయించాల్సి  ఉంటుందా? వరుణ్‌ 

యూనిట్‌ హోల్డర్‌ మరణిస్తే, వారి పేరుమీద ఉన్న యూనిట్లను నామినీ క్లెయిమ్‌ చేసుకోవాలి. అప్పుడు ఆ యూనిట్లు నామినికి బదిలీ అవుతాయి. సాధారణంగా బ్యాంకు డిపాజిట్లు, బీమా ప్లాన్లలో ఆ మొత్తం నామినీ బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. కానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌లో అలా కాకుండా యూనిట్లను నామినీకి బదిలీ చేస్తారు. ఒకసారి ఇలా బదిలీ అయిన యూనిట్లకు నామినీయే యజమాని అవుతారు. కనుక వారు కోరుకున్నంత కాలం ఆ యూనిట్లను కొనసాగించుకోవచ్చు. విక్రయించడం తప్పనిసరి కాదు.  

ఎస్‌డబ్ల్యూపీ (సిస్టమ్యాటిక్‌ విత్‌ డ్రాయల్‌ ప్లాన్‌) అంటే ఏంటి? ఏక మొత్తంలో ఓ పథకంలో పెట్టుబడి పెట్టి, తదుపరి నెల నుంచి ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఆదాయం పొందొచ్చా? అలా అయితే అది నా పెట్టుబడిపై ప్రభావం చూపిస్తుందా? – కృతిక 

పెట్టుబడులను వెనక్కి తీసుకునే విషయమై ప్రణాళిక కలిగి ఉండడం కూడా ముఖ్యమే.  మార్కెట్లలో అస్థిరతలను అధిగమించేందుకు క్రమానుగత పెట్టుబడులకు సిప్‌ ఎలా ఉపయోగపడుతుందో..? అదే మాదిరి.. సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ అన్నది పెట్టుబడిని క్రమానుగతంగా వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. మార్కెట్లు కనిష్టాల్లో (తక్కువ విలువల వద్ద) ఉన్నప్పుడు పెట్టుబడినంతా వెనక్కి తీసుకోకుండా ఎస్‌డబ్ల్యూపీ సాయపడుతుంది. ఇది రిటైర్మెంట్‌ తీసుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీని ద్వారా వారు తమకు కావాల్సినంత స్థిరమైన ఆదాయం పొందే ఏర్పాటు చేసుకోవచ్చు. 

ఎన్ని రోజులకు ఒకసారి ఆదాయం రావాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇన్వెస్టర్‌ ప్రతీ నెలా నిర్ణీత తేదీన, నిర్ణీత మొత్తాన్ని ఎస్‌డబ్ల్యూపీ ద్వారా రావాలని నిర్ణయించుకుంటే.. అదే రోజు ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఆ మేరకు పెట్టుబడుల నుంచి యూనిట్లు తగ్గిపోతాయి. సిప్‌లో ప్రతీ నెలా నిర్ణీత మొత్తం బ్యాంకు ఖాతా నుంచి కోరుకున్న మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి జమ అవుతుంది. 

దీనికి పూర్తి వ్యతిరేకంగా పనిచేసేదే ఎస్‌డబ్ల్యూపీ. కానీ, ఇక్కడ రెండు కీలక అంశాలను గుర్తు పెట్టుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో కనీసం మూడింట ఒక వంతు అయినా ఈక్విటీల్లో ఉంచుకోవాలి. ఉపసంహరించుకునే మొత్తం వార్షికంగా పెట్టుబడుల విలువలో 4–6 శాతం మించకూడదు. దీనివల్ల పెట్టుబడికి నష్టం లేకుండా ఉంటుంది. ఉదాహరణకు మీ పెట్టుబడులపై రాబడి వార్షికంగా 8–9 శాతంగా ఉండి, మీరు 5 శాతాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు అయితే.. అప్పుడు మిగిలిన 3–4 శాతం రాబడి పెట్టుబడి వృద్ధికి సాయపడుతుంది. దీనివల్ల ఎక్కువ కాలం పాటు పెట్టుబడి నిలిచి ఉంటుంది. 

ఎస్‌డబ్ల్యూపీ ద్వారా తీసుకునే మొత్తంలో కొంత పెట్టుబడి, కొంత లాభం ఉంటుంది. ఈ లాభంపైనే పన్ను పడుతుంది. డెట్‌లో అయితే మూడేళ్లకు మించిన లాభంపై 20 శాతం చెల్లించాలి. మూడేళ్లలోపు లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఈక్విటీల్లో అయితే ఏడాదిలోపు లాభంపై 15 శాతం చెల్లించాలి. ఏడాదికి మించిన లాభం మొదటి రూ.లక్షపై పన్ను లేదు. తదుపరి లాభంపై 10 శాతం పన్ను పడుతుంది. 

 Dhirendra Kumar, CEO at Value Research
ధీరేంద్ర కుమార్‌,సీఈవో,వ్యాల్యూ రీసెర్చ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement