
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తన లైనప్ నుంచి కటన బైకును నిలిపివేసింది. దీనిని కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్ తొలగించింది. 2022 జులైలో ప్రారంభమైన ఈ బైక్ లేటెస్ట్ రెట్రో డిజైన్ రైడర్లను ఆకట్టుకుని.. మంచి అమ్మకాలను సాధించగలిగింది. అయితే కాలక్రమంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడంలో విఫలమైంది. దీంతో అమ్మకాలు గణనీయంగా క్షీణించాయి. దీంతో దేశంలో అరంగ్రేటం చేసిన మూడేళ్లలోనే మార్కెట్‌కు దూరమైందని తెలుస్తోంది.
రూ.13.61 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో, కటనను కంప్లీట్లీ నాక్డ్ డౌన్ (CKD) మార్గం ద్వారా భారతదేశంలోకి వచ్చిన ఈ బైకును కంపెనీ ఎందుకు తొలగించిందనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఆదరణ తగ్గడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ బైక్ 999 సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్‌తో 11,000 rpm వద్ద 150 bhp, 9,250 rpm వద్ద 106 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
సుజుకి ఇప్పుడు కటన బైకును తొలగించడంతో.. పెద్ద బైక్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం మూడు మోడళ్లు ఉన్నాయి. అవి హయబుసా (రూ. 16.90 లక్షలు), జీఎస్ఎక్స్-8ఆర్ (రూ. 9.25 లక్షలు), వీ-స్ట్రోమ్ 800డీఈ (రూ. 10.30 లక్షలు).