ఈవీ వాడుతున్నారా? ఇది మీ కోసమే.. | Summer Heat Sparks EV Battery Risks Safety Tips for Drivers | Sakshi
Sakshi News home page

ఈవీ వాడుతున్నారా? ఇది మీ కోసమే..

Apr 15 2026 8:33 AM | Updated on Apr 15 2026 8:47 AM

Summer Heat Sparks EV Battery Risks Safety Tips for Drivers

భానుడి భగభగలు మొదలయ్యాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనుషులతోపాటు మనం వాడే వాహనాలకు సమస్యగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరిగిన నేపథ్యంలో వేసవిలో వీటి నిర్వహణపై వాహనదారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గతంలో కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు అకస్మాత్తుగా తగలబడటం లేదా పేలిపోవడం వంటి ఘటనలు ఆందోళన కలిగించాయి. అసలు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? వేసవి కాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

బ్యాటరీ ఎందుకు పేలుతుంది?

  • ఎలక్ట్రిక్ వాహనాల్లో సాధారణంగా లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. ఇవి అత్యంత శక్తివంతమైనవి, కానీ ఉష్ణోగ్రతను తట్టుకునే పవర్‌ తక్కువగా ఉంటుంది.

  • వాహనం ప్రయాణిస్తున్నప్పుడు బ్యాటరీ లోపల ఉష్ణోగ్రత నియంత్రణ తప్పి ఒక సెల్ నుంచి మరో సెల్‌కు వేడి వేగంగా వ్యాపించడాన్ని థర్మల్ రన్‌వే అంటారు. దీనివల్ల బ్యాటరీ సెకన్ల వ్యవధిలో పేలిపోయే అవకాశం ఉంటుంది.

  • బ్యాటరీలోని వోల్టేజ్, ఉష్ణోగ్రతను బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (బీఎంఎస్‌) నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇది సరిగ్గా లేకపోతే బ్యాటరీ ఓవర్ హీట్ అవుతుంది.

  • బ్యాటరీ సెల్స్‌ మధ్య ఉండే సెపరేటర్ దెబ్బతిన్నా లేదా తయారీ లోపాలు ఉన్నా అంతర్గత షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగుతాయి.

  • ఎండలో వాహనాన్ని నిలిపి ఉంచి వెంటనే ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.

వాహనదారులు పాటించాల్సిన నియమాలు

  • వాహనాన్ని నడిపి వచ్చిన వెంటనే ఛార్జింగ్‌ పెట్టకండి. బ్యాటరీ చల్లబడటానికి కనీసం 30 నుంచి 45 నిమిషాల సమయం ఇవ్వండి.

  • నేరుగా ఎండ తగిలే చోట కాకుండా గాలి ఆడే నీడ ప్రదేశంలో మాత్రమే వాహనాన్ని ఛార్జ్ చేయండి.

  • రాత్రంతా ఛార్జింగ్‌కు వదిలేయడం వల్ల ఓవర్ హీటింగ్ సమస్యలు రావచ్చు. 80-90% ఛార్జ్ అవ్వగానే ప్లగ్ తీసివేయడం ఉత్తమం.

  • ఎలక్ట్రిక్ వాహనాలను ఎప్పుడూ ఎండలో పార్క్ చేయవద్దు. తీవ్రమైన ఎండ బ్యాటరీ ప్యాక్ లోపల రసాయన చర్యల వేగాన్ని పెంచి దాన్ని బలహీనపరుస్తుంది. సాధ్యమైనంత వరకు ఇండోర్ పార్కింగ్ లేదా షెడ్లను ఎంచుకోండి.

  • తక్కువ ధరకు దొరుకుతున్నాయని నాసిరకం లేదా లోకల్ ఛార్జర్లను వాడకండి. కంపెనీ అందించిన అథెంటిక్ ఛార్జర్ మాత్రమే వాడాలి. వోల్టేజ్ హెచ్చుతగ్గులు లేకుండా చూసుకోవాలి.

  • బ్యాటరీ నుంచి వింత వాసన రావడం, బ్యాటరీ ఉబ్బినట్లు అనిపించడం, లేదా ఛార్జింగ్ సమయంలో విపరీతమైన వేడి రావడం వంటివి గమనిస్తే వెంటనే వాడటం ఆపేసి మెకానిక్‌ను సంప్రదించండి.

  • వేసవిలో ఫాస్ట్ ఛార్జింగ్ వాడకం వల్ల బ్యాటరీ త్వరగా వేడెక్కుతుంది. అత్యవసరమైతే తప్ప రెగ్యులర్ ఛార్జింగ్‌నే వాడటం బ్యాటరీ లైఫ్‌కు, భద్రతకు మంచిది.

ఎలక్ట్రిక్ వాహనం అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం వంటిది. మొబైల్ ఫోన్ మాదిరిగానే దీనికి కూడా వేడి నుంచి రక్షణ అవసరం. సాంకేతికత ఎంత పెరిగినా వినియోగదారుడికి ఉన్న అవగాహన మాత్రమే ప్రమాదాలను నివారించగలదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం ఏడాదికి ఒకసారి బ్యాటరీ హెల్త్ చెకప్ చేయించుకోవడం మర్చిపోకండి.

ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement