సెన్సెక్స్ 1,456 పాయింట్లు క్రాష్
నిఫ్టీకి 436 పాయింట్ల నష్టం
కొనసాగిన పశ్చిమాసియా అనిశ్చితి
క్రూడ్ ధరల పెరుగుదల భయాలు
అన్ని రంగాల్లో అమ్మకాల వెల్లువ
ముంబై: పశ్చిమాసియా యుద్ధంతో తలెత్తిన అనిశ్చితులు, ముడి చమురు ధరలు దూసుకెళ్లడంతో మంగళవారం దలాల్ స్ట్రీట్ 2% క్షీణించింది. దేశ ప్రజలు ‘పొదుపు చర్యలు’ పాటించాలంటూ ప్రధాని మోదీ పిలుపు ప్రభావం రెండో రోజూ కొనసాగింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత అంశాలు సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,456 పాయింట్లు కోల్పోయి 74,559 వద్ద ముగిసింది. నిఫ్టీ 436 పాయింట్లు క్షీణించి 23,380 వద్ద నిలిచింది. సూచీలకిది నాలుగోరోజూ నష్టాల ముగింపు.
నష్టాలతో మొదలైన సూచీలు క్రమంగా తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో సెన్సెక్స్ 1566 పాయింట్లు పతనమై 74,449 వద్ద, నిఫ్టీ 468 పాయింట్ల క్రాష్‌తో 23,348 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.
⇒ ఇరాన్ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగొచ్చనే ఆందోళనలు, క్రూడాయిల్ ధరలు పెరగడం, అధిక ద్రవ్యోల్బణ భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. ఆసియాలో కొరియా (–2.34%), ఇండోనేషియా(–0.68%), చైనా (–0.25%), హాంగ్‌కాంగ్(–0.22%) నష్టపోయాయి. జపాన్(0.52%), తైవాన్ (0.22%) సింగపూర్(0.07%) లాభపడ్డాయి. యూరప్‌లో బ్రిటన్(–0.39%), ఫ్రాన్స్(–0.98%), జర్మనీ(–1.52%) పతనమయ్యాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు అరశాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
⇒ స్టాక్ మార్కెట్ వరుస పతనంలో భాగంగా గడిచిన నాలుగు రోజుల్లో రూ.16.77 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ రూ.456.02 లక్షల కోట్లకు దిగివచి్చంది. మంగళవారం ఒక్కరోజే రూ.10.16 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
⇒ సెన్సెక్స్ 30 షేర్లలో ఎస్‌బీఐ(0.12%) మాత్రమే లాభంతో గట్టెక్కింది. మిగిలిన 29 షేర్లూ నష్టాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా(–4.44%), అదానీపోర్ట్స్ (–4.39%), హెచ్‌సీఎల్ టెక్ (–4.11%), టీసీఎస్(–3.84%), టైటాన్(–3.06%) షేర్లు అత్యధికంగా పతనమయ్యాయి.
⇒ బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో రియల్టీ 4.22%, ఐటీ 3.61%, సర్విసెస్ 3.51%, కన్జూమర్ డ్యూరబుల్స్ 3.35% పతనమయ్యాయి.
⇒ మార్కెట్ పతనంలో భాగంగా అదానీ గ్రూప్ షేర్లు బేర్‌మన్నాయి. అదానీ పవర్ 6%, అదానీ గ్రీన్ 5.87%, అదానీ పవర్ 5.63%, ఎన్‌డీటీవీ 4.78% అదానీ టోటల్ గ్యాస్ 4.77% క్షీణించాయి. అదానీ పోర్ట్స్ 4.39%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 4.41%, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 3.82% పతనమయ్యాయి. దీంతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.16.70 లక్షల కోట్లకు దిగివచ్చింది.
⇒ పసిడి కొనుగోళ్లు ఏడాది పాటు వాయిదా వేసుకోవాలంటూ ప్రధాని పిలుపుతో ఆభరణాల షేర్లు రెండోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. తంగమయిల్ జ్యువెలరీ 8.32%, సెంకో గోల్డ్ 6.39%, పీసీ జ్యువెలర్ 6.19%, కళ్యాణ్ జ్యువెలరీస్ 6.10%, స్కై గోల్డ్ 5.94%, త్రిభువన్ దాస్ భీంజీ జువేరీ 5.84%, టైటాన్ 3.6% పడ్డాయి.
⇒ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బేరీష్ ట్రెండ్‌కు తోడు, ఏఐ–డిఫ్లేషన్, ఓపెన్‌ఏఐ ‘డిప్లాయ్‌మెంట్ కంపెనీ’ ప్రకటనతో టెక్ మహీంద్రా(–4.44%), హెచ్‌సీఎల్ టెక్ (–4.11%), టీసీఎస్(–3.84%), విప్రో(–3.59%), ఇన్ఫోసిస్ (–3.09%), హెక్సావేర్ టెక్ (–1.42%) నష్టపోయాయి. బీఎస్‌ఈ ఐటీ ఇండెక్సు 3.67 శాతం పతనమైంది.
ఇన్వెస్టర్లలో దెబ్బతిన్న విశ్వాసం
ప్రస్తుత మార్కెట్ పతనం సాధారణ లాభాల స్వీకరణ వల్ల జరిగింది కాదు; మార్కెట్ పట్ల ఇన్వెస్టర్లలో ‘నమ్మకం దెబ్బతినడం’ వల్ల సంభవించిన పతనం ఇది. రాబోయే రోజుల్లో ఆర్థిక సవాళ్లు మరింత కఠినంగా ఉండబోతున్నాయనే సంకేతాలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. బ్యారెల్ ముడిచమురు ధర 105–107 డాలర్లకు చేరడం, రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పడిపోవడం, విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా విక్రయాలకు పాల్పడటం వంటి అంశాలు మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచాయి.
దీనికి తోడు, ఇరాన్ శాంతి ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరిస్తూ, కాల్పుల విరమణ ఒప్పందం (సీజ్‌ఫైర్) ప్రస్తుతం ‘లైఫ్ సపోర్ట్’పై ఉన్నంత బలహీన స్థితిలో ఉందంటూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ ఉద్రిక్తతలను పెంచి, మార్కెట్ల పతనానికి ప్రధాన కారణంగా నిలిచాయి
– కే. హరిప్రసాద్, లివ్‌లాంగ్ వెల్త్ ఫౌండర్,


