
ఆరంభ లాభాలు ఆవిరి
సూచీలకు స్వల్ప నష్టాలు
ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 14 పాయింట్లు నష్టపోయి 82,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 25,061 వద్ద నిలిచింది. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆరంభంలోనే ఓ మోస్తారు లాభాలు గడించాయి. ఒక దశలో సెన్సెక్స్ 338 పాయింట్లు పెరిగి 82,538 వద్ద, నిఫ్టీ 91 పాయింట్లు బలపడి 25,182 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి.
అయితే భారత్ – యూఎస్‌వాణిజ్య ఒప్పందానికి తుది గడువు ఆగస్టు 1 సమీపిస్తున్నా.. డీల్‌పై ఎలాంటి స్పష్టత రాకపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ఐటీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సూచీల ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఇండెక్సుల వారీగా బీఎస్‌ఈలో రియల్టీ 1%, టెలీకమ్యూనికేషన్, ఆటో, ఐటీ, టెక్ షేర్లు అరశాతం నష్టపోయాయి.
⇒ అంచనాలకు మించి క్యూ1 ఆర్థిక ఫలితాలు ప్రకటనతో డెలివరీ దిగ్గజం ఎటర్నల్ షేరు రెండో రోజూ రాణించింది. బీఎస్‌ఈలో 11% పెరిగి రూ.300 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 15% ఎగసి రూ.312 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. గత రెండు ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ మార్కెట్ విలువ రూ.41,013 కోట్లు పెరిగి రూ.2.89 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ నిఫ్టీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే.
శాంతి గోల్డ్ @ రూ. 189–199
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల తయారీ సంస్థ శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ పబ్లిక్ ఇష్యూకి రూ. 189–199 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 29న ముగియనుంది. దీనిలో భాగంగా 1.81 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 360 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ ప్రధానంగా విభిన్న బంగారు ఆభరణాల డిజైన్, తయారీలో కార్యకలాపాలు విస్తరించింది. ప్రస్తుతం వార్షికంగా 2,700 కేజీల బంగారు ఆభరణాల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.