
ఆటో, ఫార్మా షేర్లకు డిమాండ్
సెన్సెక్స్ లాభం 317 పాయింట్లు
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. జూన్ రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్టానికి దిగిరావడంతో ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు ఆశలు చిగురించాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు దన్నుగా నిలిచాయి. దీంతో సూచీల 4 రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 317 పాయింట్లు పెరిగి 82,571 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 113 పాయింట్లు బలపడి 25,196 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 490 పాయింట్లు బలపడి 82,744 వద్ద, నిఫ్టీ 163 పాయింట్లు ఎగసి 25,245 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఆసియాలో కొరియా, జపాన్, హాంగ్‌కాంగ్ సూచీలు 1% లాభపడ్డాయి. యూరప్ సూచీలు అరశాతం నష్టపోయాయి. అమెరికా సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.
⇒ వినిమయ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈ ఇండెక్సుల్లో ఆటో 1.50%, ఫార్మా 1.14%, వినిమయ, ఎఫ్‌ఎంసీజీ, 1%, రియల్టి, సర్విసెస్ అరశాతం చొప్పున పెరిగాయి.
⇒ తొలి త్రైమాసిక నికర లాభం 10% క్షీణత నమోదుతో హెచ్‌సీఎల్ టెక్ షేరు 3% నష్టపోయి రూ.1,566 వద్ద నిలిచింది.