
ఏడో రోజూ అమ్మకాలే
ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
ముంబై: బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టంతో ముగిసింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమావేశ ప్రారంభం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. సెన్సెక్స్ 62 పాయింట్లు నష్టపోయి 80,365 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 20 పాయింట్లు కోల్పోయి 24,635 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది వరుసగా ఏడో రోజూ నష్టాల ముగింపు.
ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. రోజంతా లాభ, నష్టాల మధ్య ట్రేడవుతూ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 80,249 వద్ద కనిష్టాన్ని, 80,851 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 49 పాయింట్లు పతనమై 24,606 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆసియాలో జపాన్ మినహా అన్ని దేశాల మార్కెట్లు 1% వరకు పెరిగాయి. యూరప్ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
⇒ బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ఐటీ 0.33%, ఇండ్రస్టియల్స్ 0.32%, ఆటో 0.12%, క్యాపిటల్ గూడ్స్ 0.09 శాతం నష్టపోయాయి. మరోవైపు ఆయిల్‌అండ్‌గ్యాస్ 2%, ఇంధన 1.10%, రియల్టీ 1%, విద్యుత్ 0.46%, సర్విసెస్ 0.41%, మెటల్ 0.39% లాభపడ్డాయి. మిడ్ క్యాప్ ఇండెక్సు 0.34% పెరిగింది. స్మాల్ క్యాప్ సూచీ 0.17% నష్టపోయింది.
⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు పైసలు బలహీనపడి 88.75 వద్ద స్థిరపడింది.
⇒ అట్లాంటా ఎల్రక్టానిక్స్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర (రూ.754)తో పోలిస్తే బీఎస్‌ఈలో 14% ప్రీమియంతో రూ.858 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 14.50% పెరిగి రూ.864 గరిష్టాన్ని తాకింది. చివరికి 9% లాభంతో రూ.823 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.6,331 కోట్లుగా నమోదైంది.
⇒ గణేశ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర (రూ.322)తో పోలిస్తే 8.38% డిస్కౌంటుతో రూ.295 వద్ద లిస్టయ్యింది. చివరికి 9% నష్టంతో రూ.294 వద్ద ముగిసింది.