
సెన్సెక్స్ నష్టం 556 పాయింట్లు
25 వేల దిగువకు నిఫ్టీ
ముంబై: హెచ్1–బీ ఫీజు పెంపు ఆందోళనలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో స్టాక్ మార్కెట్ అయిదో రోజూ నష్టపోయింది. సెన్సెక్స్ 556 పాయింట్లు క్షీణించి 81,160 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 166 పాయింట్లు కోల్పోయి 25 వేల స్థాయి దిగువన 24,891 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి జీవితకాల కనిష్టానికి చేరుకోవడం అంశాలు మరింత ఒత్తిడి పెంచాయి.
ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ గడిచే కొద్దీ మరింత నష్టాలు చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 623 పాయింట్లు కోల్పోయి 81,093 వద్ద, నిఫ్టీ 179 పాయింట్లు నష్టపోయి 24,878 వద్ద కనిష్టాలు నమోదు చేశాయి. ఆసియాలో జపాన్ మినహా అన్ని దేశాల మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు అరశాతం పతనమయ్యాయి. యూఎస్ స్టాక్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
⇒ బీఎస్‌ఈలో రంగాల వారీగా ఇండెక్సుల్లో రియల్టీ 2%, విద్యుత్ 1.38%, ఐటీ 1.23%, యుటిలిటీస్ 1.21%, కన్జూమర్ డి్రస్కేషనరీ 1.41% పతనమయ్యాయి. స్మాల్ క్యాప్ సూచీ 0.75%, మిడ్‌క్యాప్ ఇండెక్సు 0,72% నష్టపోయాయి. నష్టాల మార్కెట్లోనూ టెలికమ్యూనికేషన్, మెటల్ షేర్లు రాణించాయి.
⇒ కొత్త హెచ్–1బీ వీసా దరఖాస్తులపై అమెరికా ప్రభుత్వం లక్ష డాలర్ల పెంపుతో దేశీయ ఐటీ కంపెనీల షేర్లు నాలుగోరోజూ డీలా పడ్డాయి. ఇన్ఫోబీన్స్ 2.64%, టీసీఎస్ 2.50%, హెక్సావేర్ టెక్ 2%, హెచ్‌సీఎల్ టెక్ 1.31%, విప్రో 1.06%, ఇన్ఫోసిస్ 0.64%, టెక్ మహీంద్రా 0.61% పతనయ్యాయి.
⇒ గడిచిన నాలుగు రోజుల్లో టెక్ మహీంద్రా షేరు 7% నష్టపోవడంతో రూ.10,729 కోట్ల మార్కెట్ క్యాప్ హరించుకుపోయింది. టీసీఎస్ (–6.6%) రూ.75,799 కోట్లు, విప్రో (–5.5%) రూ.14,799 కోట్లు, ఇన్ఫోసిస్(–3.6%) రూ.23,119 కోట్లు, హెచ్‌సీఎల్(–3%) రూ.11,940 కోట్ల మార్కెట్ విలువ కోల్పోయాయి. వెరసి ఈ 5 కంపెనీలకు 4 సెషన్లలో రూ.1.36 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.
⇒ ఐవాల్యూ ఇన్ఫోసొల్యూషన్స్ షేరు లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.299)తో పోలిస్తే 4.68% డిస్కౌంటుతో రూ.285 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 8.34% క్షీణించి రూ.274 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 6% నష్టపోయి రూ.282 వద్ద నిలిచింది.