మళ్లీ బేర్‌ ఎటాక్‌! | Stock Market: Sensex crashes 1690 points and Nifty below 23000 | Sakshi
Sakshi News home page

మళ్లీ బేర్‌ ఎటాక్‌!

Mar 28 2026 3:40 AM | Updated on Mar 28 2026 3:40 AM

Stock Market: Sensex crashes 1690 points and Nifty below 23000

భీకరంగా పశ్చిమాసియా యుద్ధం   

శాంతి చర్చలపై వీడని ప్రతిష్టంభన  

107 డాలర్లకు బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 

సెన్సెక్స్‌ 1,690 పాయింట్లు క్రాష్‌.. 23 వేల దిగువకు నిఫ్టీ 

రూ.8.86 లక్షల కోట్ల సంపద ఆవిరి...

ముంబై: పశ్చిమాసియా యుద్ధం మరింత భీకరంగా మారడంతో దలాల్‌ స్ట్రీట్‌ మళ్లీ బేర్‌ గుప్పిట్లోకి వచ్చింది. అమెరికా–ఇరాన్‌ మధ్య జరగాల్సిన శాంతి చర్చలు ఇంకా ప్రతిష్టంభనలోనే కొనసాగుతున్నాయి. చమురు సరఫరా ఆందోళనలతో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌ 107 డాలర్లకు ఎగసింది. రూపాయి విలువ రికార్డు కనిష్టానికి దిగివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లు గత 19 రోజులుగా దేశీయ ఈక్విటీలను విక్రయిస్తూనే ఉన్నారు. అమెరికాలో ట్రెజరీ బాండ్లపై రాబడులు అనూహ్యంగా పెరిగాయి. ఈ పరిణామాలతో శుక్రవారం సెన్సెక్స్‌ 1,690 పాయింట్లు కోల్పోయి 73,583 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 487 పాయింట్లు పతనమై 22,820 వద్ద నిలిచింది. సూచీల 2% పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.8.86 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.422.15 లక్షల కోట్లకు దిగిచ్చింది. 

ఆసియాలో జపాన్, ఇండోనేషియా, తైవాన్, థాయిలాండ్‌ మార్కెట్లు 1–50% నష్టపోయాయి. చైనా, హాంగ్‌కాంగ్, సింగపూర్‌ సూచీలు 0.50% మేర లాభడ్డాయి. యూరప్‌లో జర్మనీ డాక్స్‌ ఇండెక్సు 1.37%, ఫ్రాన్స్‌ సీఏసీ సూచీ 0.72%, బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ ఇండెక్సు 0.30 శాతం నష్టపోయాయి. అమెరికా స్టాక్‌ సూచీలు 1.50 శాతం పతనంతో ట్రేడవుతున్నాయి.  

రోజంతా అమ్మకాలు...
బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ఉదయమే సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ఆద్యంతం అమ్మకాలు ఒత్తిడితో సూచీలు రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 1,739 పాయింట్లు క్షీణించి 73,534 వద్ద, నిఫ్టీ 501 పాయింట్లు పతనమై 22,805 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈలో రంగాల వారీగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ సూచీ 4%, రియల్టీ 3.10% పతనమయ్యాయి. మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 2.12%, 1.77 శాతం నష్టపోయాయి. 

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరగడం, ప్రభుత్వం డీజిల్, ఏటీఎఫ్‌ ఎగుమతులపై మళ్ళీ ‘విండ్‌ఫాల్‌ టాక్స్‌’ విధించడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 4.55% క్షీణించి రూ.1,348 వద్ద స్థిరపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement