
సెన్సెక్స్ లాభం 270 పాయింట్లు
మళ్లీ 25,500 స్థాయిపైకి నిఫ్టీ
ముంబై: ట్రేడింగ్ చివర్లో బ్యాంకులు, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 270 పాయింట్లు పెరిగి 83,713 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 61 పాయింట్లు బలపడి 25,523 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో ట్రేడయ్యాయి. అమెరికా–భారత్ వాణిజ్య చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. సెన్సెక్స్ 491 పాయింట్ల పరిధిలో 83,321 వద్ద కనిష్టాన్ని, 83812 వద్ద గరిష్టాన్ని తాకింది.
నిఫ్టీ 25,424 – 25,548 శ్రేణిలో కదలాడింది. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ఆరు ప్రధాన కరెన్సీ విలువలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ బలహీనపడడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు బలపడి 85.73 వద్ద స్థిరపడింది. యూరప్ మార్కెట్లు అరశాతం లాభాల్లో ముగిశాయి. అమెరికా సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
⇒ కంపెనీ తొలి త్రైమాసిక వ్యాపార అప్‌డేట్ ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో టైటాన్ కంపెనీ షేరు 6% నష్టపోయి రూ.3,441 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఆరున్నర శాతం క్షీణించి రూ.3,435 వద్ద కనిష్టాన్ని తాకింది. షేరు పతనంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.20,086 కోట్లు కోల్పోయి రూ.3.05 లక్షల కోట్లకు దిగివచి్చంది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా నష్టపోయి షేరు ఇదే.