15750 దిగువకు నిఫ్టీ

Stock market live: Sensex Falls 274 Points Nifty Settles Below 15, 750 - Sakshi

సెన్సెక్స్‌ నష్టం 274 పాయింట్లు 

ఆరంభ లాభాలు ఆవిరి 

ఫార్మా షేర్ల భారీ పతనం 

ఆగని విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు  

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూలతలు 

ముంబై: జాతీయంగా సానుకూల సంకేతాలున్నప్పటికీ.. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలు దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సూచీలు ఆరంభ లాభాలన్ని కోల్పోయి మంగళవారమూ నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడేలో 592 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్‌ చివరికి 274 పాయింట్లు నష్టపోయి 52,579 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 182 పాయింట్ల శ్రేణిలో ట్రేడైంది. మార్కెట్‌ ముగిసే సరికి 78 పాయింట్లు కోల్పోయి 15,746 వద్ద నిలిచింది. చైనా స్టాక్‌ మార్కెట్‌లో వెల్లువెత్తిన విక్రయాలు ఆసియాతో పాటు యూరప్‌ మార్కెట్లను ముంచేశాయి. అమెరికా ఫెడ్‌ ఓపెన్‌ కమిటీ సమావేశానికి ముందు(మంగళవారం రాత్రి ప్రారంభం) ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో అక్కడి మార్కెట్లు అరశాతం నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి.

ఇటీవల కొన్ని దిగ్గజ కంపెనీలు వెల్లడించిన జూన్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంక్స్, ఫార్మా షేర్లలో భారీ లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. మెటల్, ప్రభుత్వరంగ బ్యాంక్స్‌ షేర్లు లాభపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా కాఫీ ధరలు పెరగడంతో కాఫీ షేర్లకు, ఎగుమతి ఆధారిత టెక్స్‌టైల్స్‌ స్టాకులకు డిమాండ్‌ నెలకొంది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంరపర కొనసాగిస్తూ రూ.1459 కోట్ల షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.730 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ ఐదు పైసలు క్షీణించి 74.47 వద్ద స్థిరపడింది.  

ఫార్మా షేర్ల భారీ పతనం 
ఫార్మా షేర్లు ట్రేడింగ్‌లో పతనాన్ని చవిచూశాయి. ఈ రంగ కంపెనీలు జూన్‌ ఫలితాల సీజన్‌ను పేలవ ప్రదర్శనతో ప్రారంభించాయి. ఇంట్రాడేలో డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు లోయర్‌ సర్క్యూట్‌ను తాకి మూడు నెలల కనిష్టానికి చేరుకుంది. ఈ పరిణామలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ నాలుగు శాతం నష్టపోయింది. డాక్టర్‌ రెడ్డీస్‌ కంపెనీ జూన్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఇదే కంపెనీకి అమెరికా మార్కెట్‌ నియంత్రణ సంస్థ ఎస్‌ఈసీ(స్టాక్‌ ఎక్సే్చంజ్‌ కమిషన్‌) సమన్లు జారీ చేసింది. ఇంట్రాడేలో 12 శాతం నష్టపోయిన ఈ షేరు చివరికి పది శాతం నష్టంతో రూ.4843 వద్ద ముగిసింది. అరబిందో ఫార్మా, లుపిన్‌ షేర్లు 5–4% క్షీణించాయి. సిప్లా, దివిస్‌ ల్యాబ్స్, సన్‌ ఫార్మా, బయోకాన్‌ షేర్లు మూడు నుంచి రెండు శాతం నష్టపోయాయి. టొరెంటో ఫార్మా, కేడిల్లా హెల్త్‌కేర్, ఆల్కేమ్‌ ల్యాబ్స్‌ షేర్లు ఒకశాతానికి పైగా పతనమయ్యాయి.  

ఏడునెలల కనిష్టానికి ఆసియా మార్కెట్లు
చైనా స్టాక్‌ మార్కెట్‌లో మూడోరోజూ అమ్మకాలు కొనసాగడంతో ఆసియా మార్కెట్లు నెలల కనిష్టానికి దిగివచ్చాయి. చైనాకు చెందిన యాంటీ ట్రస్ట్‌ రెగ్యులేటరీ ఫుడ్‌డెలివరీ ఫ్లాట్‌ఫామ్స్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు దిగ్గజ కంపెనీలైన మీటావాన్, ఎలిడాట్‌ లాభాల్ని పరిమితం చేస్తాయనే అంచనాలతో ఆ దేశ స్టాక్‌ సూచీ షాంఘై రెండున్నర శాతం నష్టంతో ముగిసింది. చైనా మార్కెట్‌లోని ప్రతికూలతతో హాంగ్‌కాంగ్‌ సూచీ నాలుగు శాతం పతనమైంది. అలాగే సింగపూర్, థాయిలాండ్, కొరియా, ఇండోనేషియా దేశాల మార్కెట్లు రెండు నుంచి అరశాతం క్షీణించాయి.

మార్కెట్లో మరిన్ని సంగతులు
ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ల విలీనానికి రెండు కంపెనీల డైరెక్టర్లు, షేర్‌ హోల్డర్లు ఆమోదం తెలిపారు. దీంతో ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ షేరు ఆరు శాతం లాభపడి రూ.132 వద్ద ముగిసింది. ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేరు నాలుగు శాతం ర్యాలీ చేసి రూ.66 వద్ద స్థిరపడింది. 
జొమాటా షేరులో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో ఇంట్రాడేలో తొమ్మిది శాతం నష్టపోయి రూ.128 స్థాయికి దిగివచ్చింది. చివరికి ఐదున్నర శాతం క్షీణించి రూ.133 వద్ద ముగిసింది.  
నష్టాల మార్కెట్లోనూ మెటల్‌ షేర్లు మెరిశాయి. హిందాల్కో, టాటా స్టీల్‌ వంటి షేర్లు రాణించడంతో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఒకటిన్నర శాతం లాభపడింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top