
న్యూఢిల్లీ: పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు స్టాక్ ఎక్సే్ఛంజీలు షాకిచ్చాయి. కంపెనీ బోర్డులో అవసరమైనమేర స్వతంత్ర డైరెక్టర్లు లేరని జరిమానాలు విధించాయి. నిబంధనలకు అనుగుణంగా ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఒక మహిళా స్వతంత్ర డైరెక్టర్‌కు సైతం చోటు కల్పించడంలో విఫలమైనట్లు పేర్కొన్నాయి. వెరసి రూ. 5.36 లక్షలు చొప్పున చెల్లించమంటూ పవర్‌గ్రిడ్‌ను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ తాజాగా ఆదేశించాయి.
అయితే సెబీ నిబంధనల అమలు నుంచి కంపెనీకి వెసులుబాటు కల్పించవలసిందిగా ఈ నోటీస్‌పై స్పందిస్తూ స్టాక్ ఎక్సే్ఛంజీలను పవర్‌గ్రిడ్ కోరింది. ప్రభుత్వ రంగ సంస్థగా బోర్డు పదవుల నియామకాన్ని రాష్ట్రపతి చేపట్టవలసి ఉన్నట్లు పేర్కొంది.
స్వతంత్ర డైరెక్టర్ల నియామక అంశాన్ని సంబంధిత పాలనా శాఖ అయిన విద్యుత్ శాఖకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నట్లు వెల్లడించింది. దీంతో దీన్ని నిబంధనల అమలులో కంపెనీ వైఫల్యంగా పరిగణించవద్దంటూ అభ్యర్థించింది.