వచ్చే వారమే కీలక నిర్ణయం!
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని శాటిలైట్ బ్రాడ్‌బాండ్ కంపెనీ స్టార్‌లింక్ భారత్‌లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత భద్రతా సంస్థలు విధించిన అన్ని నిబంధనలను స్టార్‌లింక్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ క్రమంలో వచ్చే వారమే డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) సమావేశమై ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
కీలక భద్రతా అనుమతులు పూర్తి
భారత టెలికాం నిబంధనల ప్రకారం కఠినమైన భద్రతా పరీక్షలను స్టార్‌లింక్ ఎదుర్కొంది. ముఖ్యంగా అక్టోబర్ 2025లో ముంబైలో ప్రారంభించిన ఎక్విప్‌మెంట్ టెస్టింగ్ (పరికరాల పరీక్ష) ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. శాటిలైట్ కమ్యూనికేషన్ల ద్వారా దేశ భద్రతకు ఎటువంటి ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఈ గ్రీన్ సిగ్నల్ లభించిందని కంపెనీ తెలిపింది. వచ్చే వారం డీసీసీ ఆమోదం పొందిన తర్వాత ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లనుంది. అక్కడ క్లియరెన్స్ రాగానే భారత్‌లో స్టార్‌లింక్ సేవలు అధికారికంగా ప్రారంభమవుతాయి.
వేగవంతమైన పరిణామాలు
ఏప్రిల్ 1న స్పేస్ ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్‌వెల్, వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయిన తర్వాత ఈ ప్రక్రియ ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ చర్చల ఫలితంగానే పెండింగ్‌లో ఉన్న సాంకేతిక, భద్రతాపరమైన అంశాలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
టెలికాం దిగ్గజాల మధ్య పోటీ
స్టార్‌లింక్ రాకతో భారత శాటిలైట్ బ్రాడ్‌బాండ్ రంగంలో పోటీ తీవ్రతరం కానుంది. ఇప్పటికే ఈ రంగంలో పాగా వేయాలని చూస్తున్న ముఖేష్ అంబానీకి చెందిన జియో స్పేస్‌ఫైబర్, సునీల్ భారతీ మిట్టల్ మద్దతు ఉన్న యూటెల్‌శాట్ వన్‌వెబ్ సంస్థలకు స్టార్‌లింక్ గట్టి పోటీ ఇవ్వనుంది. మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలకు హై-స్పీడ్ డేటాను అందించడంలో ఈ పోటీ సామాన్యులకు మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
స్పెక్ట్రమ్ ధరపై ఇంకా సందిగ్ధత
భద్రతా పరమైన అనుమతులు లభించినప్పటికీ స్పెక్ట్రమ్ ధరల విషయంలో ప్రభుత్వం, నియంత్రణ సంస్థల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఏడాదికి 4 శాతం స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీని ట్రాయ్ సిఫార్సు చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మాత్రం 5 శాతం ఛార్జీ వసూలు చేయాలని మొగ్గు చూపుతోంది. అంతేకాకుండా, వినియోగదారుల టెర్మినల్స్‌పై సబ్సిడీ ఇవ్వాలనే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం తిరస్కరించింది. తద్వారా పూర్తిగా మార్కెట్ ఆధారిత ధరలే అమలయ్యే అవకాశం ఉంది.
వ్యూహాత్మక భాగస్వామ్యాలు
సేవలు ప్రారంభించక ముందే స్టార్‌లింక్ తన నెట్‌వర్క్ పంపిణీ కోసం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ సంస్థలతో పంపిణీ ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం. ఎయిర్‌టెల్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవల విస్తరణపై దృష్టి పెట్టగా, జియో తన నెట్‌వర్క్‌లో శాటిలైట్ బ్రాడ్‌బాండ్‌ను అంతర్భాగం చేయనుంది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా కూడా ఏఎస్టీ స్పేస్‌మొబైల్‌తో జతకట్టి ఈ పోటీలో నిలిచేందుకు సిద్ధమైంది.
ఇదీ చదవండి: రఫేల్ డీల్.. ‘స్వదేశీ’ అస్త్రాలకు పెద్దపీట!


