గూగుల్‌కు సౌత్‌ కొరియా మొట్టికాయలు.. భారీ జరిమానాతో మరో ఝలక్‌

South Korea Huge Fine To Google For Market Abuse - Sakshi

South Korea Fined Google: టెక్‌ దిగ్గజ కంపెనీ గూగుల్‌కు వరుసబెట్టి దెబ్బలు తగులుతున్నాయి.  ఈమధ్యే పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం ద్వారా గూగుల్‌-యాపిల్‌ ప్లేస్టోర్‌ మార్కెటింగ్‌కు భారీ దెబ్బ కొట్టింది దక్షిణ కొరియా.   తాజాగా గూగుల్‌కు ఏకంగా 207 బిలియన్‌ వన్‌ల(176 మిలియన్‌ డాలర్ల) భారీ జరిమానా విధించి వెనువెంటనే మరో దెబ్బేసింది.    

ఆల్ఫాబెట్‌ కంపెనీకి చెందిన గూగుల్‌కు దక్షిణ కొరియా యాంటీట్రస్ట్‌ రెగ్యులేటర్‌ భారీ జరిమానా విధించింది.  మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ మార్కెట్‌ పోటీలో నైతిక విలువల్ని గూగుల్‌ విస్మరించిందని, ఆధిపత్యపోరులో ఇతర కంపెనీలను నిలువరించడం ద్వారా పోటీతత్వానికి విరుద్ధంగా వ్యవహరించిందని కొరియా ఫెయిర్‌ ట్రేడ్‌ కమిషన్‌ (KFTC) చెప్తోంది. ఈ  మేరకు 176 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించడంతో పాటు.. కోర్టుల్లో కౌంటర్‌ దాఖలు చేయడానికి వీల్లేకుండా వెంటనే ఆ జరిమానాను కట్టాలంటూ గూగుల్‌కు ఆదేశాలు జారీ చేసింది. చదవండి:  టెక్‌ దిగ్గజాల కమిషన్‌ కక్కుర్తికి దెబ్బ

ఫోన్లలో ఇతర ఆపరేటింగ్‌ సిస్టమ్స్ ఉపయోగించకుండా గూగుల్‌ అడ్డుకుంటోందన్న లోకల్‌ స్మార్ట్‌ఫోన్‌ మేకర్ల ఆరోపణలపై  కేఎఫ్‌టీసీ దర్యాప్తు చేసింది. ఈ మేరకు దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలడంతో దక్షిణ కొరియా ఇలా భారీ జరిమానా విధించింది. ఇదిలా ఉంటే ఇంతకు ముందు ఫ్రాన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ కూడా గూగుల్‌ న్యూస్‌లో ‘కాపీ రైట్‌’ వివాదంలో గూగుల్‌కు భారీ జరిమానా విధించగా.. చెల్లించే ప్రసక్తే లేదంటూ కౌంటర్‌ దాఖలు చేసింది టెక్‌ దిగ్గజం. ప్రస్తుతం ఆ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. ఇక నిషేధిత కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు రష్యా కూడా రెండుసార్లు గూగుల్‌కు జరిమానాలు విధించిన విషయం తెలిసిందే.

చదవండి: సొంత దేశంలోనే గూగుల్‌కు భారీ షాక్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top