దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల విషయంలో దక్షిణాది వారు ముందుంటున్నారు. రిటైర్మెంట్ ప్లాన్ల విషయంలో స్పష్టతతో ఉంటున్నారు. ఇప్పటికే మూడింట రెండొంతుల మంది ఇందుకు సంబంధించిన ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఇఫ్సాస్ ఇండియా భాగస్వామ్యంతో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నిర్వహించిన రెడీ టు లైఫ్ ఇండెక్స్ సూచీలో దక్షిణాది రెడీనెస్ స్కోరు జాతీయ సగటైన 59కి మించి 60 స్థాయిలో నమోదైంది.
ఈ నివేదిక ప్రకారం బీమా భద్రతపై అవగాహన ఉన్నప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. తక్షణ రాబడి ఉండదని, చర్చించడానికి కొంత ఇబ్బందికరమైనదని, ఎటువంటి క్లెయిమ్ తలెత్తకపోతే నిష్ప్రయోజనమనే భావన ఇందుకు కారణమని నివేదికలో వెల్లడైంది. దక్షిణాది వారి పొదుపు ప్రాధాన్యతల్లో పిల్లల చదువు, సొంత ఇల్లు, ఆకస్మిక ప్రణాళికలు మొదలైనవి అగ్రస్థానంలో ఉన్నాయి.
అత్యవసర నిధి విషయంలో దక్షిణాది అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ మూడింట ఒక వంతు మంది సదరు నిధి ఒక నెలకు మాత్రమే సరిపోతుందని పేర్కొన్నారు. ఆర్థిక ప్రణాళిక, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధత, ఆరోగ్యం, పదవీ విరమణ వ్యూహాలపై అవగాహన–సన్నద్ధత మధ్య అంతరాలను పూరించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ సూచీ సంబంధిత అధ్యయనంలో 25–55 ఏళ్ల వయస్సు గల 1,836 మంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు


