
మూడేళ్ల వ్యవధిలో దాదాపు ఆరు లక్షల గ్రామాల్లో హై–స్పీడ్ ఆప్టికల్ ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేనున్నట్లు సీఐఐ–జీసీసీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా టెలికం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ తెలిపారు. జీసీసీలు ప్రస్తుతం ఎక్కువగా పెద్ద నగరాలకే పరిమితమవుతున్నాయని, కనెక్టివిటీ పెరుగుతున్న నేపథ్యంలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో డేటా చార్జీలు అత్యంత తక్కువగా ఉండటమనేది, జీసీసీల ఏర్పాటుకు ఎంతో ప్రయోజనకరమైన అంశమని వివరించారు.
అలాగే, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి కీలకమైన నిపుణుల లభ్యత, కనెక్టివిటీ, కొత్త ఆవిష్కరణలు చేసే సామర్థ్యాలు, మేథోహక్కుల పరిరక్షణకు పటిష్టమైన చట్టాలు మొదలైనవన్నీ భారత్‌కు సానుకూలాంశాలని పేర్కొన్నారు. దేశీయంగా బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ సగటున 138 ఎంబీపీఎస్‌గా ఉంటోందని మిట్టల్ చెప్పారు. అదనంగా మరింత స్పెక్ట్రంను అందుబాటులోకి తేవడం, పరిశోధనలు .. అభివృద్ధి కార్యకలాపాలకు అనువైన పరిస్థితులు కల్పించడం, చిన్న..మధ్య తరహా సంస్థలు అలాగే స్టార్టప్‌లను ప్రోత్సహించడం తదితర చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనితో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించినప్పుడు జీసీసీలకు డిజిటల్ మౌలిక సదుపాయాల కొరత ఉండదని మిట్టల్ తెలిపారు.