షిప్పింగ్‌ కంపెనీల ఆదాయాలు తగ్గొచ్చు | Sakshi
Sakshi News home page

షిప్పింగ్‌ కంపెనీల ఆదాయాలు తగ్గొచ్చు

Published Tue, Jan 2 2024 6:29 AM

Shipping firms may see revenue decline of 5-7percent in next fiscal year - Sakshi

ముంబై: దేశీ షిప్పింగ్‌ కంపెనీల ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 5–7 శాతం మధ్య క్షీణించొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) షిప్పింగ్‌ కంపెనీల ఆదాయం 35 శాతం వృద్ధిని చూడగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 23–25 శాతం మధ్య తగ్గుతుందని క్రిసిల్‌ నివేదిక అంచనా వేసింది.

పలు దేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చార్టర్‌ రేట్లు పెరగడం, కరోనా ఆంక్షల అనంతరం చైనా నుంచి పెరిగిన డిమాండ్‌ గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో వృద్ధికి దారితీసినట్టు క్రిసిల్‌ తెలిపింది. వివిధ విభాగాల్లో పనిచేసే షిప్పింగ్‌ కంపెనీల నిర్వహణ మార్జిన్‌ వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది. చార్టర్‌ రేట్లలో దిద్దుబాటు ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో షిప్పింగ్‌ కంపెనీల సగటు నిర్వహణ మార్జిన్‌ 33–35 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.

కరోనా ముందున్న 25–30 శాతానికంటే ఎక్కువేనని గుర్తు చేసింది. మోస్తరు మూలధన వ్యయ ప్రణాళికల నేపథ్యంలో షిప్పింగ్‌ కంపెనీల రుణ పరపతి ప్రస్తుతం మాదిరే మెరుగ్గా కొనసాగుతుందని అంచనా వేసింది. దేశంలోని మొత్తం 20 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల డెడ్‌వెయిట్‌ టన్నేజీ సామర్థ్యంలో సగం వాటా కలిగిన ఐదు షిప్పింగ్‌ కంపెనీలపై అధ్యయనం చేసి క్రిసిల్‌ ఈ వివరాలు అందించింది.  

తగ్గిన రేట్లు..
చమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు వీలుగా దేశీ షిప్పింగ్‌ కంపెనీలు ఎక్కువగా ట్యాంకర్లను (70 శాతం) కలిగి ఉన్న విషయాన్ని క్రిసిల్‌ ప్రస్తావించింది. ఆ తర్వాత బొగ్గు, ముడి ఇనుము, ధాన్యాల రవాణాకు 20 శాతం మేర సామర్థ్యం ఉండగా.. మిగిలిన 10 శాతం కంటెయినర్‌ షిప్‌లు, గ్యాస్‌ క్యారీయర్లు ఉన్నట్టు పేర్కొంది. చార్టర్‌ రేట్లు అంతర్జాతీయ డిమాండ్‌–సరఫరాకు అనుగుణంగా మారుతూ ఉంటాయని క్రిసిల్‌ తెలిపింది. ‘‘చమురు ట్యాంకర్ల చార్టర్‌ రేట్లు గత ఆర్థిక సంవత్సరంలో ఒక రోజుకు 50వేల డాలర్లుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20–25 శాత మేర తగ్గాయి.

అంతర్జాతీయ అనిశ్చితులు తగ్గడమే ఇందుకు కారణం’’అని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అనుజ్‌ సేతి తెలిపారు. ప్రస్తుత పరిస్థితే అంతర్జాతీయ వాణిజ్యంలో కొనసాగుతుందని, వచ్చే ఏడాది చార్టర్‌ రేట్లు మరికొంత దిగి వస్తాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కరోనా ముందు నాటి కంటే ఎక్కువగానే ఉంటాయని చెప్పారు. చైనా, భారత్‌ నుంచి పెరిగే డిమాండ్‌ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల చార్టర్‌ రేట్లకు మద్దతుగా ఉంటుందని క్రిసిల్‌ పేర్కొంది. మరోవైపు ట్యాంకర్ల సరఫరా పరిమితంగా ఉంటుందని, ఫలితమే చార్టర్‌ రేట్లు కరోనా ముందున్న నాటితో పోలిస్తే ఎగువ స్థాయిలోనే ఉండొచ్చని వవరించింది. డ్రై బల్క్‌ క్యారియర్ల చార్టర్‌ రేట్లు అదే స్థాయిలో కొనసాగొచ్చని పేర్కొంది. 

Advertisement
Advertisement