ధరల మంట.. పరిశ్రమలకు సెగ! దడపుట్టిస్తున్న ద్రవ్యోల్బణం 

September Retail inflation rises surging food prices - Sakshi

 సెప్టెంబర్‌లో  రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.41శాతం, 5నెలల గరిష్టం

ఆహార ధరల తీవ్రత, ఆగస్టులో ఐఐపీ 0.8శాతం క్షీణత

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బుధవారం వెలువడిన అధికారిక గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం వరుసగా తొమ్మిదవ నెల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతం వద్ద కట్టడి పరిధి దాటి నమోదయ్యింది. పైగా ఆగస్టులో 7శాతం ఉంటే, సెప్టెంబర్‌లో 7.41శాతానికి (2021 ఇదే నెల ధరలతో పోల్చి)  పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.35 శాతమే. ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వృద్ధిలేకపోగా 0.8 శాతం క్షీణించింది.  

సామాన్యునిపై ధరల భారం 
రిటైల్‌ ద్రవ్యోల్బణ బాస్కెట్‌లో  కీలక ఆహార విభాగం ధరలు సెప్టెంబర్‌లో తీవ్రంగా పెరిగాయి. మొత్తంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టం... 7.41 శాతం పెరగ్గా, ఒక్క ఫుడ్‌ బాస్కెట్‌ ఇన్‌ఫ్లెషన్‌ 8.60 ( ఆగస్టులో 7.62 శాతం) శాతానికి చేరింది. కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం రిటైల్‌ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్‌బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు)  ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్‌ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్‌ తర్వాత) చేరింది.  మరింత పెరగవచ్చనీ ఆర్‌బీఐ సంకేతాలు ఇచ్చింది.

రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. అక్టోబర్, నవంబర్‌ల్లోనూ ద్రవ్యోల్బణం ఎగువబాటనే పయనిస్తే, తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్‌ 5 నుంచి 7 సమయంలో ఆర్‌బీఐ రెపో రేటును మరో అరశాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం కట్టడిలో ఎందుకు లేదన్న అంశంపై కేంద్రానికి ఆర్‌బీఐ త్వరలో ఒక నివేదిక సమర్పిస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.

18 నెలల కనిష్టానికి  పారిశ్రామిక రంగం 
ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి గడచిన 18 నెలల్లో ఎన్నడూ లేని తీవ్ర పతన స్థాయి 0.8 శాతం క్షీణతను చూసింది. 2021 ఫిబ్రవరిలో ఐఐపీలో 3.2 శాతం క్షీణత నమోదయ్యింది. తాజా సమీక్షా నెల్లో  సూచీలో దాదాపు 60 శాతం వెయిటేజ్‌ ఉన్న తయారీ రంగం కూడా 0.7శాతం  క్షీణతను (2021 ఇదే నెలతో పోల్చి) చూసింది. గత ఏడాది ఇదే కాలంలో తయారీ ఉత్పత్తి వృద్ధి రేటు 11.1శాతం. మైనింగ్‌ ఉత్పాదకత 23.3 శాతం వృద్ధి  నుంచి 3.9 శాతం క్షీణతలోకి జారింది. విద్యుత్‌ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 16 శాతం నుంచి  1.4 శాతానికి పడిపోయింది. క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగంలో వృద్ధి రేటు 20శాతం  నుంచి 5శాతానికి పడిపోయింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top