
ట్రేడింగ్‌కు అధికారిక ప్లాట్‌ఫామ్
ఈక్విటీ డెరివేటివ్స్ గడువు పెంపు
లావాదేవీల్లో నాణ్యత, ఇన్వెస్టర్లకు రక్షణ
ప్రణాళికలు వెల్లడించిన చైర్‌పర్సన్ పాండే
ముంబై: ఐపీవోకంటే ముందు(ప్రీ ఐపీవో) లావాదేవీల నిర్వహణకు అధికారిక ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్సన్ తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. తద్వారా ప్రస్తుత అనధికార(గ్రే) మార్కెట్ లావాదేవీలకు చెక్ పెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. వెరసి నియంత్రణలకు లోబడి ప్రీఐపీవో లావాదేవీలు చేపట్టేందుకు కొత్త ప్లాట్‌ఫామ్ ఇన్వెస్టర్లను అనుమతించనుంది. ఐపీవో కేటాయింపులు(అలాట్‌మెంట్), స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ మధ్య మూడు రోజులపాటు లావాదేవీలకు వీలు కల్పించనుంది.
దీంతో ప్రస్తుత గ్రే మార్కెట్ స్థానే నియంత్రిత లావాదేవీల ప్లాట్‌ఫామ్‌కు సెబీ తెరతీయనున్నట్లు పాండే వెల్లడించారు. అయితే ఇన్వెస్టర్లు పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రీలిస్టింగ్ సమాచారం ఒక్కటే సరిపోదని 2025 ఫిక్కీ క్యాపిటల్ మార్కెట్ సదస్సు సందర్భంగా సెబీ చీఫ్ స్పష్టం చేశారు. క్యాపిటల్ మార్కెట్లను మరింత విస్తరించడంతోపాటు.. ఇన్వెస్టర్ల పరిరక్షణకు వీలుగా నియంత్రణలతోకూడిన ప్రీఐపీవో ట్రేడింగ్‌ను పరిశీలనాత్మకంగా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు.
నగదు ఈక్విటీ మార్కెట్‌పై దృష్టిఈక్విటీ డెరివేటివ్స్ గడువు(ఎక్స్‌పైరీ)లోనూ మార్పులు చేపట్టనున్నట్లు పాండే సంకేతమిచ్చారు. వీటి కాలావధి, ఎక్స్‌పైరీని ఒక క్రమపద్ధతిలో పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు. తద్వారా గతేడాది(2024–25) 91 శాతం వ్యక్తిగత ట్రేడర్లు నష్టపోయిన ఇలాంటి ప్రొడక్టులకు కళ్లెం వేసే వీలుంటుందని పేర్కొన్నారు. నగదు ఈక్విటీ మార్కెట్లను విస్తరించే బాటలో ఈక్విటీ డెరివేటివ్స్‌లో మార్పులు తీసుకురానున్నట్లు తెలియజేశారు.
దీర్ఘకాలిక గడువుగల ప్రొడక్టులను ప్రవేశపెట్టడంతో డెరివేటివ్స్ నాణ్యతను సైతం పెంచే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే సంబంధిత వర్గాలతో చర్చలు చేపట్టాక, ఒక క్రమపద్ధతిలో డెరివేటివ్ ప్రొడక్టుల మెచూరిటీపై నిర్ణయించనున్నట్లు తెలియజేశారు. దీంతో హెడ్జింగ్, దీర్ఘకాలిక పెట్టుబడులకు దన్నునివ్వనున్నట్లు వివరించారు. నగదు విభాగంలో పరిమాణం భారీగా పెరుగుతున్నట్లు వెల్లడించారు. గత మూడేళ్లలో లావాదేవీల పరిమాణం రెట్టింపైనట్లు తెలియజేశారు. పారదర్శకత కీలకమని, దీంతో క్యాపిటల్ మార్కెట్లలో నిధుల సమీకరణకు వీలుంటుందని వివరించారు.