
ప్రభుత్వ ఆస్తుల విక్రయంపై సెబీ చైర్మన్ పాండే
జాబితాలో రైల్వేలు, రహదారులు, విమానాశ్రయాలు
మౌలిక ప్రాజెక్టుల నిధుల సమీకరణకు పలు మార్గాలు
ముంబై: ప్రభుత్వ రంగంలోని ఆస్తుల మానిటైజేషన్‌ను వేగవంతం చేయవలసి ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. రైల్వేలు, విమానాశ్రయాలు, రహదారులు, ఇంధనం, పెట్రోలియం అండ్ గ్యాస్, లాజిస్టిక్స్ రంగాలలోని ప్రభుత్వ ఆస్తుల మానిటైజేషన్‌లో స్పీడ్ పెంచవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో ఆయా ప్రాజెక్టులలోకి ఇన్వెస్టర్ల పెట్టుబడులు ప్రవహించేందుకు వీలు చిక్కుతుందని తెలియజేశారు.
సెబీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పాండే గతంలో దీపమ్ కార్యదర్శిగా పనిచేసిన సంగతి తెలిసిందే. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకూ ఆస్తుల మానిటైజేషన్ ప్రణాళికలకు రచించలేదంటూనే వీటికి తెరతీయడం ద్వారా వనరుల లభ్యతకు దారి ఏర్పడుతుందని వివరించారు. తద్వారా మౌలిక సదుపాయాల(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) అభివృద్ధి జోరందుకుంటుందని అభిప్రాయపడ్డారు.
మౌలిక సదుపాయాల కల్పనకు భారీస్థాయిలో పెట్టుబడుల అవసరముంటుందని, కేవలం ప్రభుత్వం, బ్యాంకులు వీటిని భుజాలకు ఎత్తుకోలేవని వ్యాఖ్యానించారు. వెరసి వనరుల సమీకరణకు క్యాపిటల్ మార్కెట్లను ప్రత్యామ్నాయంగా భావించవచ్చని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో తెరతీసిన ఆస్తుల మానిటైజేషన్ ప్రణాళిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్(ఇన్విట్స్) మార్కెట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు నాబ్‌ఫిడ్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాండే ప్రస్తావించారు.
ఇవీ మార్గాలు
ఆస్తుల మానిటైజేషన్ చేపట్టేందుకు పలు మార్గాలున్నట్లు పాండే తెలియజేశారు. వీటిలో ఇన్విట్స్, రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్(రీట్స్), పబ్లిక్, ప్రయివేట్ భాగస్వామ్యం లేదా సెక్యూరిటైజేషన్ తదితరాలను పేర్కొన్నారు. 2017 నుంచి 21సార్లు మునిసిపల్ బాండ్ల జారీ ద్వారా రూ. 3,134 కోట్లు సమీకరించడం ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశారు. అయితే మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ తదితర సంస్థాగత ఇన్వెస్టర్లతోపాటు.. రిటైల్ ఇన్వెస్టర్లను సైతం ఆకట్టుకోవడం ద్వారా ఇన్వెస్టర్ల పరిధిని విస్తరించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు.
ఇందుకు క్రమపద్ధతిలో ఇన్‌ఫ్రా సెక్యూరిటీల జారీ చేయవలసి ఉన్నట్లు ప్రస్తావించారు. పూర్తిగా బ్యాంకులు లేదా ప్రభుత్వ బడ్జెట్‌లపై ఆధారపడితే అధిక రిసు్కలకు చాన్స్ ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు నిధుల సమీకరణలో మార్కెట్లలో కార్పొరేట్ బాండ్లు, ఇండెక్స్ రేట్లు, మునిసిపల్ బాండ్లు తదితర ఇన్‌స్ట్రుమెంట్స్‌కు వీలుంటుందని వివరించారు. డిస్‌క్లోజర్ నిబంధనల ద్వారా క్రమశిక్షణ, పారదర్శకత, సుపరిపా లన, స్వతంత్ర ఆటిట్స్, ఇన్వెస్టర్ పరిశీలన తదితరాల ఆచరణను క్యాపిటల్ మార్కెట్లు ఆదేశిస్తాయని తెలియజేశారు. వెరసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో నాణ్యత, నమ్మకానికి రక్షకులుగా క్యాపిటల్ మార్కెట్లు వ్యవహరిస్తాయని తెలియజేశారు.
ఆందోళనకరం
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రుణాలందించడంలో వాణిజ్య బ్యాంకులు వెనకడుగు వేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నట్లు నాబ్‌ఫిడ్ ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్స్ తదితరాలతో పోలిస్తే వాణిజ్య బ్యాంకులలో మౌలిక ప్రాజెక్టులపట్ల ఆసక్తి తగ్గుతున్నట్లు తెలియజేశారు. దీంతో మౌలిక ప్రాజెక్టులకు వాణిజ్య బ్యాంకుల రుణాలు క్షీణిస్తుంటే.. బ్యాంకింగేతర సంస్థల రుణ వితరణ 10 శాతం పుంజుకున్నట్లు తెలియజేశారు. వెరసి రుణాల విడుదలకు మద్దతివ్వవలసి ఉన్నట్లు పేర్కొన్నారు.
నాబ్‌ఫిడ్ అంటే?
మౌలిక సదుపాయాల ఏర్పాటు, అభివృద్ధిలో ఫైనాన్సింగ్ మద్దతిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ(నాబ్‌ఫిడ్). ఆర్‌బీఐ నియంత్రణలోని నాబ్‌ఫిడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ సౌకర్యాలను కల్పిస్తుంది. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణకు వీలుగా బాండ్లు, డెరివేటివ్స్ తదితర ఇన్నోవేటివ్ ఫైనాన్షియల్ ప్రొడక్టులను అభివృద్ధి చేయడంతోపాటు.. ఫైనాన్సింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో డేటా ఆధారితంగా ఉత్తమ కార్యాచరణకు దారి చూపుతుంది.