చైనాలో ఇంత దారుణంగా ఉందా? అసలు ఏం జరుగుతోంది?

Sakshi special story on China economy and Real Estate check the details

చైనా పైకి కనిపించేంత బలంగా లేదా? పైకి డాబుగా కనిపించే చైనా పరిస్థితి పైన పటారం.. లోన లొటారమేనా? ఆర్ధికంగా అగ్రరాజ్యం అమెరికానే తలదన్నేస్తామనే చైనా ధీమా ఉత్తుత్తిదేనా? అసలు చైనాలో ఏం జరుగుతోంది? ఇపుడీ ప్రశ్నలే ప్రపంచ ఆర్ధిక రంగ నిపుణులను వెంటాడు తున్నాయి.

ఇపుడు చైనాలో ఇల్లు కొన్నవారు తమ చెల్లింపులను కరెన్సీలోనే చెల్లించాల్సిన పనిలేదు. ఓ లారీడు  పుచ్చకాయలు.. రెండు లారీల ఉల్లిపాయలు.. మరో లారీ గోధుమలు చెల్లించినా రియల్ వ్యాపారులు కళ్లకద్దుకుని తీసుకుని తీసుకుంటారు. వస్తుమారక ద్రవ్యానికి సరికొత్త నిర్వచనం చెబుతున్నారను కోకండి. చైనాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పాతాళం లోతు సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పడానికి ఇది తిరుగులేని నిదర్శనం.

చైనాలో ఎక్కడా చూసినా ఆకాశాన్ని తాకే హర్మ్యాలు  నిటారుగా నిలబడి దర్శనమిస్తాయి. నగరీకరణ అత్యంత వేగంగా విస్తరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం రాకెట్ వేగంతో వ్యాప్తి చెందింది డ్రాగన్ కంట్రీలో. ఇదంతా కొంత కాలం క్రితం వరకు గొప్పగా చెప్పుకునే ఓ విజయం. ఇపుడు అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మామూలు  దారుణం కాదు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయి.

ఇళ్లయితే ఇబ్బడి ముబ్బడిగా కట్టేశారు కానీ...అవి కొనడానికి ఎవరి దగ్గరా డబ్బులు లేవు. ఎవరూ కొనకపోతే  నిర్మాణాలపై పెట్టిన పెట్టుబడికి వడ్డీలపై వడ్డీలు పాపంలా పెరిగిపోయి రియల్ వ్యాపారుల ఇళ్లు గుల్లవుతాయి. మరి వాళ్లేం చెయ్యాలి? జనం దగ్గర డబ్బులు లేకపోతే లేకపోయాయి ఏదో ఒక విలువైన వస్తువుంటే దాన్నయినా కరెన్సీగా  పుచ్చుకుంటే ఓ పని అయిపోతుంది కదా అని చైనా రియల్ వ్యాపారులు ఓ ప్లాన్ వేశారు. అంతే స్థానిక రైతులు ఇళ్లు కొనుక్కోడానికి ప్రోత్సహిస్తున్నాం అంటూ పైకి ఓ ముసుగు వేసుకుని  ఓ బంపర్ ఆఫర్  ప్రకటించారు.

తమ దగ్గర ఇళ్లు కొనుక్కునే వారి వద్ద డబ్బులు లేకపోతే వేరే రూపంలో అయినా చెల్లింపులు చేసే బంగారంలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు  రియల్ వ్యాపారులు. ఈ మేరకు పెద్ద పెద్ద పోస్టర్లు హోర్డింగులూ ఏర్పాటు చేశారు కూడా. ఆల్ రెడీ ఇల్లుకొని వ్యాపారులకు డబ్బులు చెల్లించాల్సిన వారు పుచ్చకాయలు, గోధుమలు, ఉల్లిపాయలు, అల్లంవంటి వ్యవసాయ ఉత్పత్తుల రూపంలో చెల్లింపులకు వెసులుబాటు కల్పించారు. ఇదంతా కూడా రైతుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించేందు కేనని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ మన ఎల్లో మీడియా తరహాలో ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే అసలు విషయం ఏంటంటే చైనాలో రియల్ ఎస్టేట్ రంగం అత్యంత ప్రమాదకరమైన లోతుల్లోకి జారిపోయింది. రుణగ్రస్తులైన చైనీస్ డెవలపర్లు సంక్షోభంలోకి నెట్టబడ్డారు.

అటు జనం దగ్గరా ఏం చేద్దామన్నా చేతుల్లో డబ్బులు లేవు. ఈ సమస్యను అధిగమించడానికి ఏం చేయాలో పాలుపోకనే రియల్ ఎస్టేట్ దిగ్గజాలు ఈ ఆఫర్ కు రూపకల్పన చేశారు. చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం ఇప్పుడే మొదలు కాలేదు. గత ఏడాది  చైనాలో అగ్రగామి రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవర్ గ్రాండే  ఒక్క సారిగా దివాళా తీసింది. ఆ వెంటనే ఫాంటాసియా అనే మరో రియల్ ఎస్టేట్ దిగ్గజం కూడా చేతులెత్తేసింది. తాము జారీ చేసిన బాండ్లకు  చేయాల్సిన చెల్లింపులు చేయలేం అంటూ ఈ రెండుకంపెనీలూ చేతులెత్తేశాయి. ఆ బాటలోనే ఇపుడు నాన్ జింగ్ లోని ఓ రియల్ డెవలపర్ కిలో పుచ్చకాయలకు 20 యువాన్ల చొప్పున రేటు కట్టాడు. అలాగే గోధుమలు, ఉల్లిపాయలు, అల్లం వంటి వ్యవసాయ ఉత్పత్తులకూ ఒక్కో రేటు కట్టారు. దీన్ని మిగతా రియల్ వ్యాపారులూ ఆమోదించి దీన్నే అనుసరించడానికి రెడీ అయిపోయారు. 

క్షీణిస్తున్న రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను పునరుద్ధరించే ప్రయత్నంలో, చైనా ప్రభుత్వం టవర్ బ్లాక్‌లను కూల్చివేస్తోందని, 75 మిలియన్ల  (యూకే  మొత్తం జనాభా)  లేదా అంతకంటే ఎక్కువ మందికి  వసతినిచ్చే నిర్మాణాల పనులను నిలిపివేస్తున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.  

(ఇంకా ఉంది..పడిపోతున్న ప్రాపర్టీ మార్కెట్‌ను రక్షించే ప్రయత్నాల్లో "బిల్డ్, పాజ్.. డిమాలిష్‌..రిపీట్‌ " విధానాన్ని అవలంబించిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వరస కథనాలు )

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top