రష్యా చమురుపై అమెరికా ఆంక్షల నడుమ రష్యా నుంచి ముడి చమురును తీసుకుని భారత్ వస్తున్న నౌక అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకుంది. షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం.. 'ఫ్యూరియా' అనే ఈ పెద్ద నౌక మంగళవారం డెన్మార్క్, జర్మనీ మధ్య మార్గం ద్వారా భారత్ వైపు వెళుతోంది. ఈ ఓడ రష్యా ప్రభుత్వ చమురు సంస్థ రోస్ నెఫ్ట్ విక్రయించిన చమురును తీసుకువెళుతోంది.
రష్యా చమురు కంపెనీలు రోస్ నెఫ్ట్, లుకోయిల్‌లను అమెరికా బ్లాక్ లిస్ట్ చేసిన వారం తర్వాత ఈ యూ-టర్న్ సంఘటన జరిగింది. ఈ రెండు కంపెనీలపై అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ అక్టోబర్ 22న ఆంక్షలు విధిస్తూ కంపెనీలు, బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా బ్లూమ్‌బర్గ్ ప్రకారం.. ఫ్యూరియా ట్యాంకర్ అక్టోబర్ 20న రష్యాలోని బాల్టిక్ నౌకాశ్రయమైన ప్రిమోర్స్క్ నుండి సుమారు 7,30,000 బ్యారెళ్ల చమురును లోడ్ చేసుకుని బయలుదేరింది. తొలుత రిలయన్స్ ఇండస్ట్రీస్, భారత్ పెట్రోలియం ఉపయోగిస్తున్న గుజరాత్‌లోని సిక్కా పోర్ట్‌ను ఈ నౌక తన గమ్యస్థానాన్ని ప్రకటించింది. ఈ నౌక నవంబర్ మధ్యలో భారత్ చేరుకుంటుందని భావించారు.
తరువాత, నౌక తన గమ్యాన్ని ఈజిప్టులోని పోర్ట్ సైద్‌కు మార్చింది. రష్యా నుండి భారత్‌కు వేగవంతమైన మార్గం సూయజ్ కాలువ గుండా ఉంటుంది. కాబట్టి నౌకలు తరచుగా సూయజ్ కాలువ గుండా వెళ్లే ముందు పోర్ట్ సైద్‌ను తమ గమ్యస్థానంగా ప్రకటిస్తుంటాయి.
అయితే ఈ ఫ్యూరియా నౌక వయస్సు కూడా సమస్య కావొచ్చు. ఫ్యూరియా ట్యాంకర్‌ను ఇప్పటికే యూరోపియన్ యూనియన్, యూకే నిషేధించాయి. ఈ ట్యాంకర్‌కు ఈ ఏడాది 23 ఏళ్లు నిండుతాయి. చమురు ట్యాంకర్ల సాధారణ పరిమితి 18 సంవత్సరాలు. అంతేకాకుండా డెన్మార్క్‌తో సహా కొన్ని యూరోపియన్ దేశాలు ఇప్పుడు తమ జలాల గుండా వెళుతున్న పాత ట్యాంకర్ల తనిఖీలను ముమ్మరం చేశాయి.


