గ్లోబల్ మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ వరుసగా క్షీణిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి తరుగుదల తర్వాత రూపాయి విలువ వాస్తవానికి అది ఉండాల్సిన దానికంటే తక్కువ విలువకే (అండర్ వాల్యూ) ట్రేడ్ అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కొన్ని విషయాలను పంచుకున్నారు.
నామినల్, రీర్ పరంగా తగ్గిన రూపాయి!
పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మానసికంగా అత్యంత కీలకమైన డాలర్‌కు 100 మార్కు వైపు రూపాయి పరుగెడుతున్న తరుణంలో గవర్నర్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘ఇటీవలి క్షీణతను గమనిస్తే రూపాయి విలువ అధికంగా లేదు(అండర్ వాల్యూ). నామమాత్రపు (నామినల్), రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్ (రీర్) పరంగా చూస్తే రూపాయి ఇప్పుడు తక్కువ వాల్యూయేషన్‌లో ఉంది. అంతేగానీ బలహీనంగా లేదు’ అన్నారు.
రీర్ అంటే..
భారత వాణిజ్య భాగస్వామ్య దేశాల కరెన్సీల సమూహంతో (బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్) పోల్చి ద్రవ్యోల్బణాన్ని కూడా సర్దుబాటు చేసిన తర్వాత రూపాయి అసలు బలాన్ని లెక్కించేదే ఈ రీర్ (రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్). దీని ప్రకారం ప్రస్తుతం రూపాయి బలహీనంగా లేదు, కేవలం తక్కువ విలువలో లభ్యమవుతోంది.
ఆర్‌బీఐ లక్ష్యం స్థిరత్వమే!
విదేశీ మారక ద్రవ్య మార్కెట్ (ఫారెక్స్ మార్కెట్)లో సెంట్రల్ బ్యాంక్ పాత్రపై గవర్నర్ మరోసారి స్పష్టత ఇచ్చారు. ఆర్‌బీఐ ఎప్పుడూ రూపాయికి ఒక నిర్దిష్ట స్థాయిని లేదా మార్పిడి రేటును లక్ష్యంగా పెట్టుకోదని ఆయన పునరుద్ఘాటించారు. మార్కెట్లో విపరీతమైన అస్థిరత (హై-వొలటాలిటీ)ను అరికట్టడానికి, ఊహాజనిత కదలికల వల్ల రూపాయి తీవ్రంగా నష్టపోకుండా కాపాడటానికి మాత్రమే ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. రికార్డు కనిష్ట స్థాయిలకు రూపాయి పడిపోతున్న తరుణంలో దానిని స్థిరీకరించేందుకు ఆర్‌బీఐ డాలర్లను విక్రయిస్తూ మార్కెట్లో తన జోక్యాన్ని వేగవంతం చేసినట్లు గత వారమే రాయిటర్స్ సంస్థ కూడా నివేదించింది.
బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్(బొప్)పై ధీమా
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ భారతదేశ విదేశీ రంగానికి ఎలాంటి ఢోకా లేదని మల్హోత్రా భరోసా ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థపై అనవసర ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘ప్రభుత్వం, ఆర్‌బీఐ, ఇతర ఆర్థిక సంస్థలు అప్రమత్తంగా ఉండటం అవసరమే కానీ దేశ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (బొప్-ఒక దేశం ప్రపంచంలోని ఇతర దేశాలతో జరిపే ఆర్థిక లావాదేవీలన్నింటినీ నమోదు చేసే వార్షిక లెక్కల చిట్టా) పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదు’ అన్నారు.
ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి


