
భారత కరెన్సీ రూపాయి విలువపై అమెరికా టారిఫ్‌ల దెబ్బ గట్టిగా తగిలింది. భారత వస్తువులపై అమెరికా సుంకాల పెంపుపై ఇన్వెస్టర్ల ఆందోళనలతో శుక్రవారం డాలర్ తో పోలిస్తే భారత రూపాయి రికార్డు స్థాయిలో 87.9650కు పడిపోయింది. భారత్ నుంచి వచ్చే వస్తువులపై ఇటీవల 25% సుంకాన్ని విధించిన అమెరికా ప్రభుత్వం ఆ మొత్తాన్ని 50% కు రెట్టింపు చేసింది. ఇది మార్కెట్ ప్రతిస్పందనను తీవ్రంగా ప్రేరేపించింది.
టారిఫ్‌ల పెంపు ప్రభావం డాలర్- రూపాయి మారక విలువ క్షీణత వరకు ఆగిపోలేదు. ఇతర దేశాల కరెన్సీతో ఇండియన్ రూపాయి మారక విలువ పడిపోయింది. ఆఫ్‌షోర్ చైనీస్ యువాన్‌తో పోలిస్తే, రూపాయి విలువ మరింత క్షీణించి, 12.3307 ను తాకింది. ఇది వారంలోనే 1.2%, నెలలో 1.6% క్షీణతను సూచిస్తుంది. గత నాలుగు నెలలుగా రూపాయి మారకం విలువ యువాన్ తో పోలిస్తే దాదాపు 6 శాతం క్షీణించింది.
డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా 87.9650కి పడిపోవడం అమెరికా టారిఫ్‌ల ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. డాలతో రూపాయి మారక విలువ ఏడాది కాలంలో 4.24% పడిపోయింది. అమెరికా విధించిన భారీ టారిఫ్‌ల వల్ల పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగడమే దీనికి కారణంగా తెలుస్తోంది.