అర కోటి పైగా జీతం.. అయినా ఏం లాభం! | Rs 55 Lakh Salary Zero Happiness Dark Side of IT Success Senior Techie Viral Post | Sakshi
Sakshi News home page

అర కోటి పైగా జీతం.. అయినా ఏం లాభం!

Apr 30 2026 12:35 PM | Updated on Apr 30 2026 12:49 PM

Rs 55 Lakh Salary Zero Happiness Dark Side of IT Success Senior Techie Viral Post

సమాజం దృష్టిలో అతను ఒక 'సక్సెస్‌ఫుల్' పర్సన్. చేతినిండా జీతం, సొంత ఇల్లు, అందమైన భార్య, ఇద్దరు పిల్లలు.. ఇలా ఒక మనిషి తన జీవితంలో సాధించాలనుకునేవన్నీ అతని దగ్గర ఉన్నాయి. కానీ, లోలోపల మాత్రం ఒక రకమైన శూన్యం. 42 ఏళ్ల ఓ ఐటీ ప్రొఫెషనల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న తన అంతర్మథనం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మధ్య వయసులో పురుషులు ఎదుర్కొంటున్న మానసిక ఒంటరితనంపై ఇది చర్చకు దారితీసింది.

కాగితం మీద అంతా పర్ఫెక్ట్! కానీ..
ఆ వ్యక్తి తన పోస్ట్‌లో తన ప్రస్తుత స్థితిని ఇలా వివరించారు.. ‘నాకు 42 ఏళ్లు. వార్షిక ఆదాయం రూ. 55 లక్షలు. చెన్నైలో సొంత ఇల్లు ఉంది. భార్య పిల్లలతో జీవితం కాగితం మీద చూస్తే చాలా పరిపూర్ణంగా కనిపిస్తుంది. సమాజం నిర్దేశించిన విజయాలన్నీ నేను అందుకున్నాను. కానీ ఈ సక్సెస్ వెనుక ఏదో మిస్ అవుతున్న భావన నన్ను వెంటాడుతోంది’.

యంత్రంలా మారిన 40ల జీవితం!
తన గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ అతను అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. జ్ఞాపకాల్లో 20లు.. ముచ్చట్లతో 30లు గడిచాయంటూ రాసుకొచ్చిన ఆయన ప్రస్తుత పరిస్థితి గురించి చెబుతూ తన ఒంటరితనాన్ని బయటపెట్టారు. ‘ఇప్పుడు నా ఫోన్ చాలా అరుదుగా మోగుతుంది. వచ్చే కాల్స్ అన్నీ ఆఫీస్ పని గురించో, బ్యాంక్ అలర్ట్ గురించో లేక ఇంటికి వచ్చేటప్పుడు పాలు తీసుకురమ్మని వచ్చే ఆదేశాలో మాత్రమే ఉంటున్నాయి. శారీరకంగా నేను ఒంటరిని కాకపోయినా, మానసికంగా మాత్రం ఒక యంత్రంలా మారిపోయాననిపిస్తోంది’ అని నిట్టూర్చారు.

నేనొక ఏటీఎం మెషీన్‌నా?
ఇంటికి వెళ్తే తన బాధ్యతలు తప్ప తన ఉనికికి గుర్తింపు లేదని అతను ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇంట్లోకి అడుగుపెట్టగానే నేను కేవలం 'అప్పా' (నాన్న) మాత్రమే. స్కూల్ ఫీజులు కట్టేవాడిగా, ఇంట్లో వైఫై పనిచేయకపోతే బాగు చేసేవాడిగా, రిపేర్లు చూసుకునే వ్యక్తిగానే నా పాత్ర పరిమితమైపోయింది. ఆఫీసులో సీనియర్ హోదాలో ఉండటంతో నా దగ్గర అన్నిటికీ సమాధానాలు ఉండాలని అందరూ ఆశిస్తారు. నేను ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో, బలంగా కనిపించాలి. నా బలహీనతను బయటపెట్టే అవకాశం ఎక్కడా లేదు’. అని ఘొల్లుమన్నారు.

ఆ 15 నిమిషాలే నా ప్రపంచం!
‘కొన్నిసార్లు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు కావాలనే కారును నెమ్మదిగా నడుపుతాను. ఆ అదనపు 15 నిమిషాలు కారులో ఒంటరిగా ఉన్నప్పుడే.. నేను మళ్లీ 'నేను'లా అనిపిస్తాను’ అంటూ తన మనసులోని భారాన్ని దించుకోవడానికి అతను చేసే చిన్న ప్రయత్నం అందరినీ ఆలోచింపజేస్తోంది.

ఈ పోస్ట్ చదివిన చాలామంది నెటిజన్లు, ముఖ్యంగా ఐటీ రంగంలోని మిడ్-లెవల్ ప్రొఫెషనల్స్, 'ఇదీ మా కథే' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్థిక స్థిరత్వం ఒక్కటే జీవితం కాదని, మనుషుల మధ్య భావోద్వేగ అనుబంధాలు, వ్యక్తిగత సమయం ఎంత అవసరమో ఈ పోస్ట్ గుర్తు చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement