‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి డాలర్ విలువ, ద్రవ్యోల్బణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు పెరుగుతున్నాయనే భావన తప్పని, అసలు సమస్య డాలర్ కొనుగోలు శక్తి క్షీణించడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
“బంగారం ఖరీదవడం లేదు.. డాలర్ చవకబారుతోంది” అంటూ కియోసాకి తన పోస్టులో స్పష్టం చేశారు. ఆర్థిక సలహాదారుగా ఆరు సంవత్సరాలకు పైగా పని చేసిన తన స్నేహితుడు కూడా 37 ఏళ్ల వయసులోనే ఈ నిజాన్ని అర్థం చేసుకున్నాడని తెలిపారు. ప్రజలు తమ జీతాలు పెరిగాయని భావిస్తున్నా, వాస్తవానికి డాలర్ విలువ తగ్గిపోవడంతో ఎక్కువ నోట్లు చేతికి వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
తన స్నేహితుడి తండ్రి ఉదాహరణను కూడా కియోసాకి ప్రస్తావించారు. ఒకప్పుడు 10 వేల డాలర్ల విలువైన ఇల్లు, అదే సమయంలో తీసుకున్న 10 వేల డాలర్ల జీవిత బీమా పాలసీ గురించి చెబుతూ.. నేడు ఆ ఇల్లు 7.5 లక్షల డాలర్లకు చేరగా, బీమా మాత్రం ఇప్పటికీ 10 వేల డాలర్లుగానే ఉందన్నారు. “ఒకటి ద్రవ్యోల్బణాన్ని అనుసరించింది.. మరొకటి అనుసరించలేదు” అని వ్యాఖ్యానించారు.
1971 నుంచి అమెరికన్ డాలర్ తన కొనుగోలు శక్తిలో 93 శాతం కోల్పోయిందని కియోసాకి పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలను అదే కరెన్సీలో పొదుపు చేయమని ఆర్థిక వ్యవస్థ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాలు నిరంతరం కరెన్సీ ముద్రిస్తూనే ఉంటాయని, ఫలితంగా కరెన్సీ విలువ తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రోమ్ సామ్రాజ్యం నుంచి అమెరికా వరకు చరిత్రలో ఇదే పునరావృతమైందని ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో అమెరికా భారీగా డబ్బు ముద్రించిందని గుర్తుచేశారు. కరెన్సీ విలువ తగ్గినా, భూమి, బంగారం, వెండి, చమురు, వ్యాపారాల వంటి నిజమైన ఆస్తులు మాత్రం తమ విలువను నిలబెట్టుకుంటాయని అన్నారు.
డాలర్‌ను ‘డబ్బు’గా కాకుండా ప్రతి ఏడాది కరిగిపోతున్న ‘కొలమానం’గా చూడాలని కియోసాకి సూచించారు. బంగారం ఐదు వేల ఏళ్లుగా తన విలువను నిలబెట్టుకుందని, పేపర్ కరెన్సీలు చివరికి విలువ కోల్పోతాయని పేర్కొన్నారు. చివరగా “డాలర్లు దాచుకోవద్దు.. నిజమైన ఆస్తులను సొంతం చేసుకోండి” అంటూ బంగారం, వెండి, బిట్‌కాయిన్, రియల్ అసెట్స్‌లో పెట్టుబడుల వైపు మొగ్గుచూపాలని ప్రజలకు సూచించారు.


