టాప్‌ 100లో రిలయన్స్‌ | Reliance Ranked 96th On The Fortune Global List | Sakshi
Sakshi News home page

టాప్‌ 100లో రిలయన్స్‌

Aug 12 2020 4:28 AM | Updated on Aug 12 2020 5:38 AM

Reliance Ranked 96th On The Fortune Global List - Sakshi

న్యూఢిల్లీ: దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) తాజాగా మరోసారి ప్రపంచంలోనే అగ్రశ్రేణి 100 కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది. 2020 సంవత్సరానికి గాను ఫార్చూన్‌ గ్లోబల్‌ 500 జాబితాలో గతేడాదితో పోలిస్తే 10 స్థానాలు ఎగబాకి 96వ స్థానానికి చేరింది. ఫార్చూన్‌ గ్లోబల్‌ 500లో ఇప్పటివరకు ఒక భారతీయ సంస్థ దక్కించుకున్న అత్యధిక ర్యాంకు ఇదే. 2012లో రిలయన్స్‌ తొలిసారిగా 99వ ర్యాంకు దక్కించుకుంది. అయితే, 2016లో 215 ర్యాంకుకు తగ్గింది. ఆ తర్వాత నుంచి మళ్లీ క్రమంగా మెరుగుపడి, టాప్‌ 100లో చోటు దక్కించుకుంది. ఇక తాజా లిస్టులో ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) 34 ర్యాంకులు తగ్గి 151వ స్థానంలో, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) 30 ర్యాంకులు తగ్గి 190వ స్థానంలో నిల్చాయి. ఎస్‌బీఐ 15 ర్యాంకులు మెరుగుపడి 221వ స్థానంలో ఉంది. భారత్‌ పెట్రోలియం (309), టాటా మోటార్స్‌ (337), రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ (462) కూడా లిస్టులో ఉన్నాయి.  

ఆదాయాల ప్రాతిపదిక..: 2020 మార్చి ఆఖరు లేదా అంతకు ముందు ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయాల ప్రాతిపదికన కంపెనీల ర్యాంకింగ్‌లను నిర్ణయించినట్లు ఫార్చూన్‌ తెలిపింది. రిలయన్స్‌ ఆదాయం 86.2 బిలియన్‌ డాలర్లు కాగా, ఐవోసీ 69.2 బిలియన్‌ డాలర్లు, ఓఎన్‌జీసీ 57 బిలియన్‌ డాలర్లు, ఎస్‌బీఐ 51 బిలియన్‌ డాలర్ల ఆదాయం ఆర్జించాయి.  

అగ్రస్థానంలో వాల్‌మార్ట్‌.. 
ఫార్చూన్‌ 2020 లిస్టులో అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ మరోసారి అగ్రస్థానంలో నిల్చింది. వాల్‌మార్ట్‌ ఆదాయం 524 బిలియన్‌ డాలర్లు. ఇక చైనాకు చెందిన సైనోపెక్‌ గ్రూప్, స్టేట్‌ గ్రిడ్, చైనా నేషనల్‌ పెట్రోలియం తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

రిలయన్స్‌లో వాటాలపై ఆరామ్‌కో మదింపు.. 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి చెందిన రిఫైనింగ్, పెట్రోకెమికల్‌ వ్యాపార విభాగంలో 20 శాతం వాటాల కొనుగోలుకు సంబంధించి మదింపు ప్రక్రియ జరుగుతోందని సౌదీ ఆరామ్‌కో సీఈవో అమీన్‌ నాసర్‌ తెలిపారు. ‘ఇది చాలా పెద్ద డీల్‌. సమీక్షించుకునేందుకు తగినంత సమయం అవసరం. మదింపు ప్రక్రియ పూర్తయ్యాక డీల్‌పై ఒక నిర్ణయం తీసుకుంటాం‘ అని జూన్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా నాసర్‌ చెప్పారు. చమురు, రసాయనాల విభాగం (ఓ2సీ) విలువ సుమారు 75 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని ఆర్‌ఐఎల్‌ గతేడాది లెక్కగట్టింది. దీని ప్రకారం ఈ డీల్‌ విలువ దాదాపు 15 బిలియన్‌ డాలర్లుగా ఉండవచ్చని అంచనా. వాస్తవానికి ఈ ఏడాది మార్చి నాటికే ఒప్పందం కుదరాల్సి ఉన్నప్పటికీ జాప్యం జరిగింది. ఇంధన మార్కెట్‌లో పరిస్థితులు, కరోనా వైరస్‌ పరిణామాల నేపథ్యంలో డీల్‌ కుదుర్చుకోవడంలో జాప్యం జరిగిందని ఇటీవల జరిగిన ఆర్‌ఐఎల్‌ ఏజీఎంలో ముకేశ్‌ అంబానీ కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement