
సొంత అనుబంధ సంస్థగా ఏర్పాటు
రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా వెల్లడి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరుతో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సేవల కంపెనీకి తెరతీసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా వెల్లడించింది. పూర్తి అనుబంధ కంపెనీగా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇందుకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి సర్టీఫికెట్‌ను పొందినట్లు తెలియజేసింది. గత నెలలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) లో కొత్తగా ఏఐ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు వెల్లడించిన సంగతి తెలిసిందే.
తద్వారా భారీస్థాయి ఏఐ మౌలికసదుపాయాలకు తెరతీయనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్లోబల్ టెక్ దిగ్గజాలు మెటా, గూగుల్‌తో కొత్త భాగస్వామ్యాలను సైతం ప్రకటించారు. గిగావాట్ సామర్థ్యంతో రిలయన్స్ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌ఐఎల్ ఇప్పటికే వెల్లడించింది. గ్రీన్ ఎనర్జీ మద్దతుతో ఏఐ–రెడీ డేటా సెంటర్లతో నెలకొల్పుతున్నట్లు తెలియజేసింది. దశాబ్దంక్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు డిజిటల్ సరీ్వసులు గ్రోత్ ఇంజిన్‌గా నిలవగా.. ఇకపై ఏఐతో మరింత పురోభివృద్ధిని అందుకోనున్నట్లు ఏజీఎంలో ముకేశ్ పేర్కొన్నారు.