
సాక్షి, సిటీబ్యూరో: నది ఇసుక కొరత, అధిక ధరల కారణంగా గ్రేటర్ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇసుక రవాణా దారులు రేట్లు పెంచడం నిర్మాణ రంగానికి మరింత భారంగా పరిణమించింది. మహానగరంలో ఇసుక దొరకడం గగనమవడంతో బిల్డర్లు ప్రత్యామ్నాయంగా రోబో ఇసుక వినియోగాన్ని పెంచారు.
ధర తక్కువే..
ఇప్పటికే కాంక్రీట్ మిక్సింగ్ యూనిట్లలో రోబో ఇసుక (క్రష్డ్ రాక్ సాండ్)ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇసుక రేట్లతో పోలిస్తే దీని ధర ఎంతో తక్కువ. అయితే రోబో ఇసుక విరివిరిగా దొరక్కపోవడం.. ప్రత్యేకంగా కొన్ని క్రషర్లలోనే ఇలాంటి ఇసుకను ఉత్పత్తి చేస్తుండటంతో సాధారణ గృహ నిర్మాణాల్లో దీని వినియోగం తక్కువగా ఉంది. అలాగే రోబో ఇసులాగే మెటల్ క్రషింగ్ స్టోన్ డస్ట్ కూడా ఉండటం వీటిలో నాణ్యమైన ఇసుకను గుర్తించడం కష్టంగా మారుతోంది.
రోబో తయారీ ఈజీ..
నగర శివార్లలో విరివిగా లభ్యమయ్యే గ్రనైట్ శిలలతో రోబోశాండ్‌ను ఉత్పత్తి చేయవచ్చు. మెటల్ క్రషర్స్‌లో మిగిలిన వ్యర్థ శిలలను 2ఎంఎం, 1ఎంఎం పరిమాణంలో క్రష్ చేసి జల్లెడ పడితే ఈ ఇసుక తయారవుతుంది. తక్కువ సమయంలో నాణ్యత కలిగిన ఇసుకను తయారు చేయవచ్చన్నది నిపుణుల మాట. ఈ ఇసుకను నగరంలో రెడీమిక్స్ యూనిట్ల ద్వారా భారీ నిర్మాణాలకు వినియోగిస్తున్నారు.