రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా భలే సరదా మనిషి!

Ratan Tata Condolences To Rakesh Jhunjhunwala - Sakshi

ఆత్మీయులకు ‘భాయ్‌’... మార్కెట్‌కు ‘రాకీ’... 
ప్రపంచానికి ‘బిగ్‌ బుల్‌’... స్టాక్‌ మార్కెట్‌కు
పర్యాయపదంగా ఇన్వెస్టర్లకు చిరపరిచితమైన మన భారతీయ ‘వారెన్‌ బఫెట్‌’ అర్ధాంతరంగా అల్విదా చెప్పేశారు!! ఒక సాధారణ ఇన్వెస్టర్‌గా 
మార్కెట్లోకి అడుగుపెట్టిన రాకేశ్‌ 
ఝున్‌ఝున్‌వాలా... అట్టడుగు స్థాయి 
నుంచి ‘ఆకాశ’మే హద్దుగా దూసుకెళ్లారు. ఆయన మాటే ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ పాఠం... నడిచొచ్చే స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌... ఇలా ఎన్ని చెప్పినా తక్కువేనేమో ఆయన గురించి! పట్టిందల్లా బంగారమే అనేంతలా, ఆయన పెట్టుబడులు కనక వర్షం కురిపించాయి. ఇప్పటికీ ‘రంకె’లేస్తూనే ఉన్నాయి. ‘ఇన్వెస్ట్‌మెంట్‌ గురు’గా పేరొందడమే కాదు... నవతరం ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్‌ వైపు చూసేలా చేసిన ‘జూమ్‌ జూమ్‌’వాలా.. 
భారతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ రంగంలో చిరస్థాయిగా నిలిచిపోతారు!! అలాంటి ఇన్వెస్టింగ్‌ మాంత్రికుడి హఠాన్మరణంపై పలువురు సంతాపం తెలిపారు.
  

 ఆర్థిక ప్రపంచంలో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా చెరగని ముద్ర వేశారు. భారతదేశ పురోగతిపై ఆయనకు ఎంతో ఆశావహంగా ఉండేవారు. ఆయన మరణం బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’  – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి 

‘ఇన్వెస్టరు, రిస్కులు తీసుకునే సాహసి, స్టాక్‌ మార్కెట్లపై అపారమైన పట్టు గల రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఇక లేరు. ఆయనకు భారత సామర్థ్యాలు, సత్తాపై అపార విశ్వాసం ఉండేది.‘ – నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి 
 
దేశీయ స్టాక్‌ ఎక్ఛేంజీలపై రాకేశ్‌కు గల అవగాహన అపారం. సరదా వ్యక్తిత్వం, దయాగుణం, దూరదృష్టికి గాను ఆయన గుర్తుండిపోతారు. ఆయన కుటుంబానికి నా సానుభూతి. 
– రతన్‌ టాటా, గౌరవ చైర్మన్, టాటా గ్రూప్‌  
 

భారతదేశ వృద్ధి అవకాశాలపై గట్టి నమ్మకంతో రాకేశ్‌ సాహసోపేత నిర్ణయాలు తీసుకునేవారు. టాటా గ్రూప్‌ అంటే రాకేశ్‌కు ఎంతో గౌరవం. ఆయన లేని లోటు తీర్చలేనిది.  
– ఎన్‌ చంద్రశేఖరన్, చైర్మన్, టాటా సన్స్‌ 
 
నా స్నేహితుడి మరణం ఎంతో బాధ కలిగించింది. స్టాక్‌ మార్కెట్లపై అవగాహన కల్పించిన వ్యక్తిగా ఆయన అందరికీ గుర్తుండిపోతారు. – అనిల్‌ అగర్వాల్, చైర్మన్, వేదాంత రిసోర్సెస్‌ 
 
రాకేశ్‌ నా స్కూల్, కాలేజీ స్నేహితుడు. తను నాకన్నా ఒక ఏడాది జూనియర్‌. భారత్‌ విలువ మరెంతో ఎక్కువగా ఉంటుందని గట్టిగా నమ్మినవాడు. ఆర్థిక మార్కెట్లను అర్థం చేసుకోవడంలో నిష్ణాతుడు. కోవిడ్‌ సమయంలో మేము తరచూ మాట్లాడుకునేవాళ్లం. – ఉదయ్‌ కొటక్, ఎండీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 
 
ప్రఖ్యాత ఇన్వెస్టరు ఝున్‌ఝున్‌వాలా అకాల మరణం ఎంతగానో బాధ కలిగించింది. తన అద్భుతమైన విశ్లేషణలతో మన ఈక్విటీ మార్కెట్ల సత్తాపై ప్రజల్లో నమ్మకం కలిగేలా ఆయన స్ఫూర్తినిచ్చారు. ఆయన్ను ఎన్నటికీ మర్చిపోలేము. – గౌతమ్‌ అదానీ, చైర్మన్, అదానీ గ్రూప్‌

చదవండి👉రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా విజయ రహస్యం అదే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top