టికెట్ లేని ప్రయాణం.. రైల్వే శాఖ ఎన్ని వేలకోట్లు అర్జించిందో తెలుసా?

2022-23లో 3.6 కోట్ల మంది రైల్వే ప్రయాణికులు తప్పుడు టిక్కెట్లు లేదా టికెట్ తీసుకోకుండా ప్రయాణించినట్లు తేలింది. ఇది అంతకుముందు సంవత్సరం కంటే దాదాపు కోటి పెరిగింది. 2019-2020లో 1.10 కోట్ల మంది టిక్కెట్లు లేకుండా ప్రయాణించారు. వారిలో వెళ్లాల్సిన గమ్యస్థానం ఒకలా ఉంటే ఎక్కిన ట్రైన్ వేరేలా ఉంది. 2021-22లో ఈ సంఖ్య 2.7 కోట్లు ఉండగా 2022-23లో 3.6 కోట్లకు చేరినట్లు ఆర్‌టీఐ నివేదికలో తేలింది.
దీంతో రైల్వే శాఖ ప్రయాణికులకు విధించిన ఫైన్ రూపంలో భారీ ఆదాయాన్ని గడించింది. 2020-21లో రూ.152 కోట్ల నుండి 2021-22లో రూ.1,574.73 కోట్లు, 2022-23లో రూ.2,260.05 కోట్లను వసూలు చేసింది.
ట్రైన్ టికెట్ తీసుకోకుండా పట్టుబడితే
ట్రైన్ టికెట్ తీసుకోకుండా పట్టుబడితే ప్రయాణీకుడు టికెట్ అసలు ధరతో పాటు కనీసం రూ.250 జరిమానా చెల్లించాలి. ఎవరైనా జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తే లేదా డబ్బులు లేకపోతే వారిని రైల్వే పోలీసులకు అప్పగించి, రైల్వే చట్టంలోని సెక్షన్ 137 కింద కేసు నమోదు చేస్తారు. డిఫాల్టర్‌ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. వెయ్యి రూపాయలు జరిమానా విధించవచ్చు. ఒకవేళ వ్యక్తి ఇప్పటికీ జరిమానా చెల్లించకూడదనుకుంటే, వారికి ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ప్రయాణికులకు అనుగుణంగా లేని రైల్వే సేవలు
మరోవైపు ప్రయాణికులకు అనుగుణంగా రైల్వే సదుపాయం లేదని తెలుస్తోంది. రైల్వే శాఖ అందించిన సమాచారం మేరకు 2022-23లో 2.7 కోట్ల మందికి పైగా ప్రయాణికులు టిక్కెట్లు కొనుగోలు చేసినప్పటికీ వారు వెయిటింగ్ లిస్ట్‌తో ట్రైన్ ఎక్కలేకపోయారు. ఈ డేటా దేశంలో రద్దీగా ఉండే మార్గాల్లో రైళ్ల కొరతను సూచిస్తుంది. కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన కార్యకర్త చంద్ర శేఖర్ గ్వార్ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నకు ప్రతిస్పందనగా.. రైల్వే శాఖ పై డేటాను సమర్పించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
చదవండి👉 రూ.2వేల నోట్ల మార్పిడి.. బ్యాంక్ ఖాతాదారులకు భారీ ఊరట!
మరిన్ని వార్తలు