
జూన్ చివరికి 46 శాతం వాటా
28.2 శాతానికి ప్రైవేటు బ్యాంకుల పరిమితం
ముంబై: గృహ రుణ మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం చివరికి మొత్తం గృహ రుణాల్లో 46.2 శాతం వాటాతో ప్రభుత్వరంగ బ్యాంకులు ముందున్నాయి. 2024 జూన్ చివరికి ఇది 37.6 శాతంగా ఉంది. ఇదే కాలంలో ప్రైవేటు బ్యాంకుల వాటా 35.2 శాతం నుంచి 28.2 శాతానికి పడిపోయింది. ఈ వివరాలను క్రెడిట్ బ్యూరో సంస్థ క్రిఫ్ హైమార్క్ విడుదల చేసింది.
రిటైల్ రుణాల్లో గృహ రుణాల వాటాయే పెద్ద మొత్తంలో ఉంటోంది. ఎందుకంటే ఇతర రుణాలతో పోల్చి చూస్తే ఒక్కో గృహ రుణం పరిమాణం అధిక మొత్తంలో ఉండడం, పైగా ఇది సెక్యూర్డ్ లోన్ కావడంతో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఈ మార్కెట్లో గట్టిగా పోడీపడుతుంటాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల గృహ రుణాల్లో 31–90 రోజుల వరకు చెల్లింపులు లేని రుణాలు 2.85 శాతానికి చేరినట్టు క్రిఫ్ హైమార్క్ నివేదిక తెలిపింది.
అదే ప్రైవేటు రంగ బ్యాంకుల గృహ రుణాల్లో ఇలాంటి వసూలు కాని రుణాలు 1.04 శాతమే ఉన్నట్టు వెల్లడించింది. ప్రైవేటు బ్యాంకులు రిస్క్‌ను ముందుగా గుర్తించడం, బలమైన అండర్‌రైటింగ్ (రుణ అర్హతలు, రుణ గ్రహీత చెల్లింపు సామర్థ్యాలను విశ్లేíÙంచడం) ప్రమాణాలను పాటించడం దీనికి కారణంగా పేర్కొంది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రూ.35 లక్షల్లోపు రుణాల్లోనే చెల్లింపులు నిలిచిపోయినవి ఎక్కువగా ఉంటున్నట్టు తెలిపింది.
పెద్ద మొత్తంలో రుణాల పట్ల ఆసక్తి
బ్యాంకులు చిన్న రుణాల కంటే పెద్ద పరిమాణంలో గృహ రుణాల మంజూరు పట్ల ఆసక్తి చూపిస్తున్నాయి. రూ.75 లక్షలకు పైబడిన రుణాల (ఒక్కోటీ) మంజూరు 38 శాతానికి చేరగా, క్రితం ఏడాది దే కాలంలో ఇది 33.6 శాతంగా ఉన్నట్టు క్రిఫ్ హైమార్క్ నివేదిక తెలిపింది. ఇక రూ.5–55 లక్షల్లోపు గృహ రుణాల మంజూరు 34.7 శాతం నుంచి 31.2 శాతానికి తగ్గాయి.
కొత్త క్రెడిట్ కార్డుల్లో స్తబ్దత
కొత్త క్రెడిట్ కార్డుల మంజూరు జూన్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 28 శాతం తగ్గి 40.6 లక్షలుగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఆర్‌బీఐ నియంత్రణలను కఠినతరం చేయడం, బ్యాంకుల రిస్క్ ధోరణి తగ్గడం, రుణ ఆస్తుల పటిష్టతపై దృష్టి సారించడం కారణాలుగా పేర్కొంది. జూన్ త్రైమాసికంలో కొత్త క్రెడిట్ కార్డుల మంజూరులో ప్రైవేటు బ్యాంకుల వాటా ఏడాది క్రితం ఉన్న 71 శాతం నుంచి 75 శాతానికి పెరిగింది.