వర్క్‌ ఫ్రం హోంకు ప్రాధాన్యం! | PM Modi Indians Delay Gold Purchases Cut Foreign Travel Safeguard Forex | Sakshi
Sakshi News home page

వర్క్‌ ఫ్రం హోంకు ప్రాధాన్యం!

May 11 2026 11:30 AM | Updated on May 11 2026 12:23 PM

PM Modi Indians Delay Gold Purchases Cut Foreign Travel Safeguard Forex

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో దేశ ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు భారతీయులందరూ ఆర్థిక దేశభక్తిని చాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన రాబోయే ఏడాది కాలం పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పౌరులను కోరారు. విదేశీ మారక ద్రవ్యాన్ని (ఫారెక్స్‌) ఆదా చేయడం ద్వారా రూపాయి విలువను స్థిరీకరించి దేశ ఆర్థిక పునాదులను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ విజ్ఞప్తి చేశారు.

సంక్షోభ సమయం.. అప్రమత్తత అవసరం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, అంతరాయం కలుగుతున్న సరఫరా గొలుసు వ్యవస్థలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘సరఫరా గొలుసుపై ఒత్తిడి ఉన్నప్పుడు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సవాళ్లు ఎదురవుతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచడం మనందరి బాధ్యత’ అని ప్రధాని పేర్కొన్నారు.

ముఖ్యంగా భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధ మేఘాల వల్ల ఎరువులు, చమురు ధరలు పెరగడం వల్ల డాలర్ అవుట్‌ఫ్లో పెరిగి విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో బంగారం వంటి ‘అంతగా అవసరం లేని’ (డిస్క్రీషనరీ) దిగుమతులను తగ్గించడం వల్ల వాణిజ్య లోటును అదుపులో ఉంచవచ్చని ఆయన ఆకాంక్షించారు.

బలమైన స్థితిలో ఫారెక్స్ నిల్వలు

ప్రధాని ఈమేరకు విజ్ఞప్తి చేసినప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన పూర్తి భరోసా ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా గణాంకాల ప్రకారం, భారత్ ప్రస్తుతం అత్యంత పటిష్టమైన స్థితిలో ఉంది. మార్చి 2026 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 691.11 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ నిల్వలు దాదాపు 11 నెలల పాటు దేశ దిగుమతి అవసరాలను తీర్చగలవు. భారత్ వద్ద ప్రస్తుతం 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఇందులో 680.05 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఆర్‌బీఐ ఇప్పటికే విదేశాల నుంచి స్వదేశానికి రప్పించి భద్రపరిచింది. ఆర్‌బీఐ వైవిధ్య వ్యూహం వల్ల విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా సెప్టెంబర్ 2025లో 13.92% ఉండగా, అది మార్చి 2026 నాటికి 16.7 శాతానికి పెరిగింది.

ప్రధాని సూచించిన మార్గదర్శకాలు

  • విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి కేవలం బంగారం వాయిదా వేయడమే కాకుండా జీవనశైలిలో పలు మార్పులు చేసుకోవాలని ప్రధాని సూచించారు.

  • పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు మెట్రో రైలు, కార్ పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి.

  • సాధ్యమైన చోట ఇంటి నుంచే పని విధానాన్ని అనుసరించడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించవచ్చు.

  • విదేశీ వస్తువుల కంటే స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలి.

  • వ్యక్తిగత వాహనాల కంటే ప్రభుత్వ రవాణా వ్యవస్థలను, రైల్వే సరుకు రవాణా సేవలను వినియోగించుకోవాలి.

  • రసాయన ఎరువుల దిగుమతి భారాన్ని తగ్గించేందుకు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి.

‘మనం చేసే ప్రతి చిన్న పొదుపు, దేశాన్ని ప్రపంచ ఆర్థిక సమస్యల నుంచి కాపాడుతుంది’ అని ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ప్రయోజనాలే పరమావధిగా పౌరులు స్పందించాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి: నిప్పులపై నీళ్లు చల్లినట్లు.. బంగారం ధరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement