రిటైర్మెంట్‌ కోసం స్మాల్‌క్యాప్‌ బెటరా? | personal finance questions and answers for better future youth finance | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ కోసం స్మాల్‌క్యాప్‌ బెటరా?

Jul 21 2025 8:38 AM | Updated on Jul 21 2025 9:23 AM

personal finance questions and answers for better future youth finance

మనీ మార్కెట్‌ ఫండ్‌ ఎవరికి అనుకూలం? – స్వర్ణముఖి

మనీ మార్కెట్‌ ఫండ్‌ అన్నది డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం. ఏడాది కాలంలో గడువు ముగిసే స్వల్ప కాల డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్లు, ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. రిస్క్‌లేని ఊహించదగిన రాబడులను ఇవి ఇవ్వగలవు. ఇవి అధిక నాణ్యత కలిగిన సాధనాల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తాయి. కనుక మనీ మార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ దాదాపు రిస్క్‌లేని, అధిక రక్షణతో కూడినవి. స్వల్పకాలానికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే కాస్త అధిక రాబడులను ఇస్తాయి. ఎందుకంటే ఇవి వైవిధ్యమైన సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. ఏడాది కాలానికి ఇన్వెస్ట్‌ చేసుకునే వారు వీటిని పరిశీలించొచ్చు. బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతాలో డిపాజిట్లపై రాబడి కంటే అధిక రాబడిని ఇవ్వగలవు. బ్యాంక్‌ ఖాతాల్లో ఎక్కువ బ్యాలన్స్‌ ఉంచుకునే వారు ఇందులో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

మొత్తం 16 రకాల డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉండగా, లిక్విడ్‌ ఫండ్స్, షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ అన్నవి రిటైల్‌ ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంటాయి. మీ పెట్టుబడుల కాల వ్యవధి ఏడాది అయితే లిక్విడ్‌ ఫండ్స్‌ మంచివి. ఇవి తక్కువ రిస్క్‌ పథకాలు. అత్యవసర నిధికి వీటిని ఉపయోగించుకోవచ్చు. ఏడాదికి మించిన కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటే షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకోండి. ఏడాది నుంచి మూడేళ్ల కాల సాధనాల్లో ఇవి ఇన్వెస్ట్‌ చేస్తాయి. డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడంలో ఉన్న ప్రాథమిక లక్ష్యం పెట్టుబడి పరిరక్షణతోపాటు, కొంత రాబడి కోరుకోవడం. ఈ దృష్ట్యా లిక్విడ్‌ ఫండ్స్, షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ అనుకూలంగా ఉంటాయి.

రిటైర్మెంట్‌ నిధి కోసం స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చా?  – అనిరుధ్‌ భట్టాచార్య

దీర్ఘకాలంలో సంపద సృష్టికి స్మాల్‌క్యాప్‌ పథకాలను పరిశీలించొచ్చు. స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులకు దీర్ఘకాలం ఒక్కటే ప్రామాణికం కాదు. నష్ట భయాన్ని, యూనిట్ల విలువ క్షీణించినా తట్టుకునే గుండె నిబ్బరం కావాలి. ఇవి నిర్ణీత సమయాల్లో (సైకిల్స్‌) భారీ నష్టాలకు గురవుతుంటాయి. మార్కెట్లో ఇతర విభాగాలు మంచి పనితీరు చూపిస్తూ, స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులు నష్టాలను చూపిస్తుంటే ఆందోళన చెందడం సహజం. అందుకనే మీ మొత్తం పెట్టుబడుల్లో 10–15% మించి స్మాల్‌క్యాప్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోకుండా ఉండడం సూచనీయం. చిన్న కంపెనీని ఎంపిక చేసుకుంటే, అది ఆ తర్వాతి కాలంలో పెద్ద కంపెనీగా మారితే, మంచి సంపద సృష్టి జరుగుతుంది. కానీ, అలా ఎంపిక చేసుకున్న ప్రతి కంపెనీ బడా కంపెనీ అవ్వాలనేమీ లేదు. సంపదను తుడిచిపెట్టేవీ ఉంటాయి. ఆటుపోట్లను తట్టుకునే బలం చిన్న కంపెనీలకు తక్కువ. లార్జ్‌క్యాప్‌ కంపెనీలతో పోలిస్తే మంచి వృద్ధిని చూపించగలవు.

ఇదీ చదవండి: దీర్ఘకాలానికి మంచి ట్రాక్‌ రికార్డు

మరీ చిన్న కంపెనీలు అయితే ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు సైతం దూరంగా ఉంటారు. స్మాల్‌క్యాప్‌ విభాగం పెద్దది. స్మాల్‌క్యాప్‌ విభాగంలో వివిధ పథకాల మధ్య ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. కనుక సిప్‌ ద్వారా స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల రిస్క్‌ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా స్మాల్‌క్యాప్‌ కంపెనీలకు సంబంధించి తగినంత లిక్విడిటీ ఉండదు. చిన్న కంపెనీలు కావడంతో ఫ్రీ ఫ్లోటింగ్‌ ఈక్విటీ తక్కువ. దీంతో మార్కెట్ల కరెక్షన్లలో కొద్ది విక్రయాలకే ఎక్కువ నష్టపోతుంటాయి. మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌ కంపెనీలతో పోలిస్తే స్మాల్‌క్యాప్‌ కంపెనీలు రిస్క్‌ ఎక్కువతో ఉంటాయి. చిన్న కంపెనీల్లో ఏ ధరలో ప్రవేశించారు, ఎక్కడ విక్రయించారన్నది రాబడులకు కీలకం అవుతుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement