
డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.122.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కొన్ని త్రైమాసికాల నుంచి నష్టాలను పోస్ట్ చేస్తోన్న సంస్థ చాలా రోజుల తర్వాత లాభాలను రిపోర్ట్ చేసింది. కంపెనీ ఎంప్లాయ్ స్టాక్ ఆపరేషన్ ప్లాన్(ఇఎస్ఓపీ)లో గణనీయమైన సర్దుబాట్ల వల్ల ఇది సాధ్యమైందని కంపెనీ తెలిపింది.
కంపెనీ వార్షికంగా 28% ఆదాయ పెరుగుదలను నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో రూ.1,917 కోట్లు సమకూరినట్లు చెప్పింది. ఇది దాని చెల్లింపులు, ఆర్థిక సేవల విభాగాల్లో స్థిరమైన వృద్ధిని ప్రతిబింబిస్తుంది. 2021లో పబ్లిక్ లిస్టింగ్ తర్వాత వన్ 97 కమ్యూనికేషన్స్‌కు ఇది మెరుగైన క్వార్టర్లలో ఒకటి. కొన్నేళ్లుగా వస్తున్న నష్టాల తర్వాత వ్యయ నియంత్రణ, ప్రధాన సర్వీసుల్లో పెరుగుతున్న మానిటైజేషన్‌తో కంపెనీ స్థిరపడుతున్నట్లు చెప్పింది.
ఇదీ చదవండి: ప్రభుత్వ సర్వీసులకు ఓపెన్‌ఏఐతో భాగస్వామ్యం
తక్కువ నిర్వహణ ఖర్చులు, మర్చంట్ సబ్ స్క్రిప్షన్‌లు, డివైజ్ ఇన్‌స్టలేషన్ నిరంతర విస్తరణ లాభాలకు ఎంతో తోడ్పడిందని కంపెనీ తెలిపింది. పేటీఎం చెల్లింపుల మౌలిక సదుపాయాలు, ఆర్థిక సేవల పంపిణీ నుంచి బలమైన సహకారం లభించినట్లు చెప్పింది. ఎగ్జిక్యూటివ్ పరిహారం, ఈఎస్ఓపీ గవర్నెన్స్‌కు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి వన్ 97 కమ్యూనికేషన్స్ ఇప్పటికే చర్యలు చేపట్టింది. కంపెనీ ఎండీ, సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు ఇచ్చిన 21 మిలియన్ స్టాక్ ఆప్షన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.