ఇక పెయింట్లు, టైల్స్‌ బౌన్స్‌బ్యాక్‌!

Paints And Ceramic Tiles Manufacturing Sector Profit Rising - Sakshi

రియల్టీ రంగ వృద్ధితో ఈ రంగాల్లోని కంపెనీలకు  ఊతం 

ఆర్థిక వ్యవస్థ రికవరీతో జోష్‌ 

దన్నుగా నిలుస్తున్న చౌక రుణాలు 

విశ్లేషకుల తాజా అంచనాలు 

కోవిడ్‌–19 మహమ్మారి నేపథ్యంలో ఇటీవల హౌసింగ్‌ రంగం జోరందుకుంది. సొంత ఇంటిని సమకూర్చుకోవాలన్న తపనకుతోడు.. కొన్నేళ్ల కనిష్టాలకు చేరిన వడ్డీ రేట్లు హౌసింగ్‌ రంగానికి బూస్ట్‌నిస్తున్నాయి. మరోపక్క పలు రంగాలు ఆన్‌లైన్‌ సేవలవైపు మళ్లడంతో ఐటీ, ఈకామర్స్‌ తదితర రంగాలు సైతం దూకుడు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై వాణిజ్య సముదాయాలకూ డిమాండ్‌ పెరగనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ప్రధానంగా పెయింట్లు, సిరామిక్‌ టైల్స్‌ రంగాలకు అవకాశాలను పెంచే వీలున్నట్లు చెబుతున్నారు.

ముంబై: కరోనా మహమ్మారి పంజా విసరడంతో గత ఆర్థిక సంవత్సరం (2021–22) పెయింట్లు, సిరామిక్‌ టైల్స్‌ రంగాలు కుదేలయ్యాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌లు, సొంత ప్రాంతాలకు తరలిపోయిన వలసకూలీలు, నిలిచిపోయిన నిర్మాణం, ఉత్పత్తి తదితరాలు ప్రభావం చూపాయి. వీటికితోడు ముడివ్యయాలు పెరిగిపోయాయి. పెయింట్స్‌ పరిశ్రమలో ప్రధానంగా ముడిచమురు నుంచి లభించే ఉపఉత్పత్తులు(డెరివేటివ్స్‌) ముడిసరుకుగా వినియోగితమవుతుంటాయి. గ్యాస్‌ ధరలు బలపడటంతో సిరామిక్‌ టైల్స్‌ తయారీ వ్యయాలు సైతం పెరిగాయి.

అయితే పరిశుభ్రత, క్రిమికీటక రక్షణ ఆధారిత ప్రొడక్టులు, వాటర్‌ ప్రూఫింగ్‌ తదితరాలను ప్రవేశపెట్టడం ద్వారా పెయింట్ల పరిశ్రమ రికవరీ బాట పట్టింది. సంఘటిత రంగంలోని లిస్టెడ్‌ కంపెనీలు ఇందుకు దారి చూపాయి. లీడింగ్‌ సిరామిక్‌ టైల్స్‌ కంపెనీలు సైతం పరిశుభ్రత, క్రిమికీటక రక్షణ ప్రొడక్టులను విడుదల చేయడం ద్వారా అమ్మకాలు పెంచుకునే బాట పట్టాయి. వీటికి ఎగుమతి ఆర్డర్లు దన్నునిస్తున్నాయి. అధిక గ్యాస్‌ ధరలు అసంఘటిత రంగ కంపెనీలకు సవాళ్లు విసరడం వీటికి కలసి వస్తోంది. టైల్స్‌ తయారీ దిగ్గజాలు ఫాసెట్స్, బాత్‌రూమ్‌ ఫిట్టింగ్స్‌ తదితర విభాగాలలోకి ప్రవేశించడం ద్వారా మరింత బలపడుతున్నాయి.  

ధరల పెంపు..: మార్జిన్లపై ఒత్తిళ్ల నేపథ్యంలో పలు కంపెనీలు కొంతకాలంగా ఉత్పత్తులకు ధరలు పెంచుతూ వస్తున్నాయి. గతేడాది కొద్ది నెలలపాటు ఉత్పత్తి నిలిచిపోవడం, అమ్మకాలు పడిపోవడంతో ఇటీవల పెంటప్‌ డిమాండ్‌ కనిపిస్తోంది. ఫలితంగా అమ్మకాల పరిమాణం పుంజుకోనుంది. అయితే దీర్ఘకాలానికి అందుబాటు ధరల్లో గృహ సముదాయాలపై ప్రభుత్వ విధానాలు, పట్టణీకరణ, పుంజుకుంటున్న గ్రామీణ ఆదాయాలు రియల్టీ రంగ వృద్ధికి దోహదపడనున్నాయి. మరోపక్క పారిశ్రామిక రంగ రికవరీ సైతం పెయింట్స్‌ పరిశ్రమకు ఆశలు కల్పిస్తోంది. ఆటో రంగం జోరందుకుంటే పెయింట్‌ పరిశ్రమ మరింత కళకళలాడేందుకు అవకాశముంటుంది. వెరసి రెండేళ్ల మందగమనం తదుపరి పెయింట్‌ కంపెనీలు భారీ లాభాల రంగులను అద్దుకునే వీలుంది. 

వృద్ధి అంచనాలు 
సిరామిక్‌ టైల్స్‌ వినియోగం ఊపందుకుంటున్న నేపథ్యంలో 2027కల్లా పరిశ్రమ రెట్టింపునకు జంప్‌చేయవచ్చని అంచనా. వెరసి లిస్టెడ్‌ కంపెనీల టర్నోవర్‌ ఐదారేళ్లలో రెట్టింపయ్యే అవకాశముంది. టైల్స్‌ పరిశ్రమ విలువ 2019లో 3.7 బిలియన్‌ డాలర్లు(రూ. 27,500 కోట్లు)గా నమోదైంది. వార్షికంగా 8.6 శాతం వృద్ధి నమోదైతే 2027కల్లా 7.14 బిలియన్‌ డాలర్ల(రూ. 53,120 కోట్లు)కు చేరుకునే వీలుంది. ఇక పెయింట్ల మార్కెట్‌ విలువ రూ. 50,000 కోట్లుకాగా.. రెండు, మూడేళ్లపాటు డిమాండ్‌ కొనసాగవచ్చని అంచనా. దీంతో భారీ సామర్థ్య వినియోగానికి మార్గమేర్పడనుంది.

పలు అవకాశాలు 
పెయింట్స్‌ పరిశ్రమలో లిస్టెడ్‌ దిగ్గజాలు ఏషియన్‌ పెయింట్స్‌సహా, బెర్జర్, కన్సాయ్‌ నెరోలాక్, ఆక్జో నోబెల్, ఇండిగో పెయింట్స్‌కు పలు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏషియన్‌ పెయింట్స్, బెర్జర్‌ పెయింట్స్‌ కౌంటర్లపట్ల నిపుణులు ఆశావహంగా స్పందిస్తున్నారు. గత మూడు నెలల్లో ఏషియన్‌ పెయింట్స్, కన్సాయ్‌ నెరోలాక్‌ 13% లాభపడ్డాయి. ఇక సిరామిక్‌ టైల్స్‌ విభాగంలో కజారియా, సెరా, హింద్‌ శానిటరీవేర్, సొమానీ సిరామిక్స్‌ తదితరాలు పెంటప్‌ డిమాండ్‌ నుంచి లబ్ధి పొందనున్నాయి. గత మూడు నెలల్లో కజారియా 25 శాతం జంప్‌చేయగా.. సొమానీ 24 శాతం ఎగసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top