
ఏప్రిల్‌లో 16 శాతం అధికం
ఫౌండిట్ నివేదిక వెల్లడి
ముంబై: కొంత కాలంగా స్తబ్దత కనిపించిన ఐటీ రంగంలో మళ్లీ నియామకాలు జోరందుకున్నాయి. ఏప్రిల్ నెలలో నియామకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 16 శాతం పెరిగినట్టు జాబ్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫౌండిట్’ వెల్లడించింది. అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల (జీసీసీలు) విస్తరణ నియామకాల వృద్ధికి దోహదం చేసినట్టు తెలిపింది.
2024–25లో జీసీసీలు కొత్తగా 1,10,000 టెక్ ఉద్యోగాలకు నియామకాలు చేసిన విషయాన్ని ప్రస్తావించింది. డేటా ఇంజనీరింగ్, ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్ తదితర ఉద్యోగాలకు డిమాండ్ నెలకొన్నట్టు తెలిపింది. ఫౌండిట్ డాట్ ఇన్ సైట్‌పై నమోదైన జాబ్ పోస్టింగ్‌ల డేటా ఆధారంగా నెలవారీ ఈ నివేదికను ఫౌండిట్ విడుదల చేస్తుంటుంది.
నైపుణ్యాలతో కూడిన ఉద్యోగ నియామకాల ఆధిపత్యం ఏప్రిల్‌లో స్పష్టంగా కనిపించింది. విద్యార్హతల కంటే కూడా ప్రత్యక్ష అనుభవానికి 62 శాతం ఐటీ కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఏఐ/ఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలైటిక్స్ విభాగాల్లో ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది.
ఐటీ రంగం ఉద్యోగ ప్రకటనల్లో వీటి వాటాయే 95 శాతంగా ఉండడం గమనార్హం. ఏప్రిల్‌లో నియామకాల పరంగా కోయింబత్తూర్‌లో 40 శాతం, అహ్మదాబాద్‌లో 17 శాతం, బరోడాలో 15 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. ఇక బెంగళూరులో 9 శాతం, ముంబైలో 9 శాతం, ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో 7 శాతం చొప్పున నియామకాలు పెరిగాయి.