
2027 నాటికి అంచనా ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ నివేదిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో సంఘటిత ఫ్లెక్సి వర్క్‌ఫోర్స్ 2027 నాటికి గణనీయంగా పెరగనుంది. ఈ ఏడాది ఈ సంఖ్య 72.3 లక్షలుగా ఉండగా, 2027 నాటికి 91.6 లక్షలకు చేరనుంది. సాంప్రదాయ నియామకాల విధానాలకు భిన్నంగా, అవసరాన్ని బట్టి కంపెనీలు తాత్కాలిక నియామకాలు చేపట్టే ధోరణి పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోంది. ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎఫ్) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం దేశీయంగా సంఘటిత ఫ్లెక్సి స్టాఫింగ్ మార్కెట్ 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.20 లక్షల కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు ఐఎస్‌ఎఫ్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా విలేకరుల సమావేశంలో తెలిపారు. భారమైన నిబంధనల బాదరబందీ లేకుండా అవసరం, డిమాండ్, తమ వెసులుబాటుని బట్టి వ్యాపార సంస్థలు నియమించుకునే తాత్కాలిక సిబ్బందిని ఫ్లెక్సి వర్క్‌ఫోర్స్‌గా వ్యవహరిస్తారు.
త్రైపాక్షిక మోడల్ కింద దేశీయంగా ఫ్లెక్సి వర్క్‌ఫోర్స్ 2023 ఆర్థిక సంవత్సరంలో 57 లక్షలుగా ఉండగా, 12.6 శాతం వార్షిక వృద్ధితో ఈ ఏడాది 72.3 లక్షలకు చేరిందని భాటియా చెప్పారు. కోవిడ్ అనంతరం ఆర్థిక వ్యవస్థ రికవరీ, డిజిటల్ పరివర్తన, పాలసీ సంస్కరణలు ఇందుకు దన్నుగా నిల్చాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చైనా, అమెరికా తర్వాత ఫ్లెక్సి సిబ్బంది విషయంలో భారత్ మూడో స్థానంలో ఉందని భాటియా వివరించారు. సంఘటిత కాంట్రాక్ట్ సిబ్బంది ఐదు రాష్ట్రాల్లో (తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు) అత్యధికంగా ఉన్నట్లు చెప్పారు.
లాజిస్టిక్స్, బీఎఫ్‌ఎస్‌ఐలో అత్యధికం..
రంగాలవారీగా చూస్తే లాజిస్టిక్స్, బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), తయారీ రంగాల్లోని మొత్తం సంఘటిత కాంట్రాక్ట్ సిబ్బందిలో ఫ్లెక్సి సిబ్బంది అత్యధికంగా సుమారు 38 శాతం ఉంటారని నివేదిక పేర్కొంది. రాబోయే ఐదేళ్లలో పండుగ సీజన్లలో పరిశ్రమ మరింతగా ఫ్లెక్సి సిబ్బంది వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని వివరించింది.
సిబ్బందిని తాత్కాలికంగా పెంచుకోవాల్సిన అవసరం ఉండే ఈ–కామర్స్, ఆతిథ్య, రిటైల్ తదితర రంగాల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపించవచ్చని నివేదిక తెలిపింది. అదే సమయంలో పారిశ్రామికీకరణ వేగవంతం కావడం, ఐటీ, రిటైల్, ఈ–కామర్స్, తయారీ లాంటి రంగాలు వృద్ధి చెందడం వల్ల ఉద్యోగులకు డిమాండ్ స్థిరంగా ఉంటోందని పేర్కొంది. స్వల్పకాలిక ప్రాజెక్టుల కోసం, సీజనల్ పనిభారాన్ని తగ్గించుకోవడం కోసం కంపెనీలు తాత్కాలిక సిబ్బంది నియామకాలు పెంచుకుంటున్నాయని రిపోర్ట్ తెలిపింది.