ఒరాకిల్‌ బాస్‌కు షాక్.. రూ.16 లక్షల కోట్లు లాస్‌! | Oracle Boss Larry Ellison Wealth Plummets by 193 Billion in Six Months | Sakshi
Sakshi News home page

ఒరాకిల్‌ బాస్‌కు షాక్.. రూ.16 లక్షల కోట్లు లాస్‌!

Apr 3 2026 8:39 PM | Updated on Apr 4 2026 9:01 AM

Oracle Boss Larry Ellison Wealth Plummets by 193 Billion in Six Months

టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ లారీ ఎల్లిసన్ సంపద ఊహించని రీతిలో ఆవిరైపోయింది. గడిచిన ఆరు నెలల కాలంలోనే ఆయన నికర విలువ ఏకంగా 193 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 16.10 లక్షల కోట్లు) మేర క్షీణించింది. ఒరాకిల్ షేర్లు మార్కెట్‌లో భారీగా పతనమవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

కుబేరుల జాబితాలో వెనక్కి..
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ 22, 2025 నాటికి ఎల్లిసన్ నికర విలువ 388 బిలియన్‌ డాలర్లుగా ఉండేది. అప్పట్లో ఆయన ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఏప్రిల్ 3, 2026 నాటికి అది 195 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. దీంతో ప్రపంచ కుబేరుల ర్యాంకింగ్స్‌లో ఆయన రెండో స్థానం నుండి ఆరో స్థానానికి పడిపోయారు.

షేర్ల పతనమే కొంపముంచింది..
ఒరాకిల్ సంస్థలో ఎల్లిసన్‌కు దాదాపు 41% వాటా ఉంది. కంపెనీ షేర్ల విలువ తగ్గితే ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ కూడా నేరుగా ప్రభావితమవుతుంది. సెప్టెంబర్ 2025లో 345.72 డాలర్ల వద్ద ఉన్న ఒరాకిల్ షేర్ ధర, ఏప్రిల్ 2, 2026 నాటికి 146.38 డాలర్లకి పడిపోయింది. అంటే దాదాపు 58% మేర పతనం నమోదైంది.

భారీగా ఉద్యోగుల తొలగింపు 
ఒకవైపు సంపద క్షీణిస్తుండగా, మరోవైపు ఒరాకిల్ సంస్థ ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా భారీగా ఉద్యోగ కోతలకు పాల్పడింది. మార్చి 31న ప్రపంచవ్యాప్తంగా సుమారు 20,000 నుండి 30,000 మంది ఉద్యోగులను (మొత్తం సిబ్బందిలో 18%) తొలగించినట్లు సమాచారం.

భారత్‌పై తీవ్ర ప్రభావం
మీడియా నివేదికల ప్రకారం, ఈ తొలగింపుల ప్రభావం భారత్‌పై తీవ్రంగా ఉంది. దేశంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 12,000 మంది ఉద్యోగులను కంపెనీ సాగనంపినట్లు తెలుస్తోంది.

"ప్రస్తుత వ్యాపార అవసరాలు, సంస్థాగత మార్పులను దృష్టిలో ఉంచుకుని మీ పాత్రను తొలగించాలని నిర్ణయించాం," అంటూ తెల్లవారుజామునే ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వ్యాపార ఒత్తిళ్లు, మార్కెట్ అస్థిరత నేపథ్యంలో ఒరాకిల్ తీసుకున్న ఈ నిర్ణయాలు అటు ఇన్వెస్టర్లను, ఇటు ఐటీ నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement