
న్యూఢిల్లీ: ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ భారత్‌లో ‘చాట్‌జీపీటీ గో’కి సంబంధించి కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ప్రకటించింది. ఉచిత ప్లాన్‌తో పోలిస్తే 10 రెట్లు అధికంగా మెసేజీలు, ఇమేజ్‌ల జనరేషన్, ఫైల్ అప్‌లోడ్స్ పరిమితులతో ఈ ప్లాన్ నెలవారీగా రూ. 399గా ఉంటుంది. చాట్‌జీపీటీ అధునాతన సామర్థ్యాలను మరింత అందుబాటు ధరలో పొందాలనుకునే వారి కోసం ‘చాట్‌జీపీటీ గో’ని డిజైన్ చేసినట్లు వివరించింది.
యాక్సెస్ విషయంలో ప్రాధాన్యత, వేగవంతమైన పనితీరు, అధిక యూసేజీ పరిమితులు అందించే ప్రస్తుత చాట్‌జీపీటీ ప్లస్‌కి (నెలకు రూ. 1,999) ఈ కొత్త ప్లాన్ అదనంగా ఉంటుంది. అత్యంత అధునాతన మోడల్స్, మరింత కస్టమైజేషన్ కావాలనుకునే ప్రొఫెషనల్స్, సంస్థల కోసం చాట్‌జీపీటీ ప్రో (నెలకు రూ. 19,900)ని అందిస్తున్నట్లు ఓపెన్‌ఏఐ వివరించింది. యూపీఐ విధానంతో కూడా సబ్ స్క్రిప్షన్‌కి చెల్లింపులు జరపవచ్చని చాట్‌జీపీటీ వీపీ నిక్ టర్లీ తెలిపారు. చాట్‌జీపీటీకి భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రెండో భారీ మార్కెట్‌గా ఉంది.