ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్స్‌తో ఆర్థిక స్థిరత్వానికి రిస్క్‌

Open End Investment Funds A Potential Vulnerability To Assets Markets Said Imf - Sakshi

వాషింగ్టన్‌: అంతర్జాతీయంగా ఓపెన్‌ ఎండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ గణనీయంగా వృద్ధి చెంది, 2022 మార్చి నాటికి 41 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయని.. వీటితో అస్సెట్‌ మార్కెట్లకు రిస్క్‌ పొంచి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. వీటి కచ్చితమైన నిర్వహణకు వీలుగా అంతర్జాతీయంగా నియంత్రణ సంస్థల మధ్య గొప్ప సమన్వయం అవసరమని అభి ప్రాయపడింది. అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వానికి సంబంధించి తాజా నివేదికను ఐఎంఎఫ్‌ విడుదల చేసింది. 

ఫైనాన్షియల్‌ మార్కెట్లలో ఓఎన్‌ ఎండ్‌ ఫండ్స్‌ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొంది. లిక్విడ్‌ ఆస్తులను నిర్వహిస్తూ, ఇన్వెస్టర్ల నుంచి రోజు వారీ పెట్టుబడుల ఉపసంహరణకు అనుమతిస్తున్నందున, ఏకపక్ష విక్రయాలతో మార్కెట్లలో తీవ్ర కుదుపులు చోటుచేసుకోవచ్చని తెలిపింది. దీనివల్ల ఆటుపోట్లు పెరిగి, ఫైనాన్షియల్‌ మార్కెట్ల స్థిరత్వానికి ముప్పు పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.

ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్స్‌ అన్నవి ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టేందుకు, వాటిని వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా ఉండే పథకాలు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తున్న క్రమంలో ఈ ఫండ్స్‌ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ చోటు చేసుకోవచ్చని, ఇది మార్కెట్లలో ఒత్తిళ్లకు దారితీయవచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. 

సమన్వయంతో నియంత్రించాలి: ‘‘ఈ ఫండ్స్‌ అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. కనుక వీటి విక్రయాల ప్రభా వం వివిధ దేశాల్లో ఉంటుంది. వీటి కచ్చితమైన నిర్వహణకు వీలుగా అంతర్జాతీయ స్థాయిలో లిక్వి డిటీ నిర్వహణ విధానాలు ఉండాలి. ఇందుకు ని యంత్రణ సంస్థల మధ్య గొప్ప సమన్వయం అవసరం’’అని ఐఎంఎఫ్‌ తన నివేదికలో సూచించింది.

ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశానికి ముందు ఈ నివేదిక విడుదలైంది. ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్స్‌ నుంచి పొంచి ఉన్న సంస్థాగత రిస్క్‌ను తగ్గించేందుకు ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నట్టు గుర్తు చేసింది. ‘‘ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత ఓపెన్‌ ఎండెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పథకాలు అనూహ్య వృద్ధిని చూశాయి. వాటి నిర్వహణలోని ఆస్తులు 2008 నుంచి 4 రెట్లు పెరిగి 2022 మార్చి నాటికి 41 ట్రిలియన్‌ డాలర్లకు చేరాయి’’అని వెల్లడించింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top