భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన ఎడ్‌టెక్ స్టార్టప్‌గా వెలుగొందిన బైజూస్‌కు (Byju's) భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2024 ఏప్రిల్ నుంచి తన ఆస్తుల వివరాలను వెల్లడించే విషయంలో కోర్టు ఇచ్చిన పలు ఆదేశాలను ధిక్కరించినందుకు గానూ, సింగపూర్ కోర్టు రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే 2026 మే 27 నాటికి ఆయన సుమారు 70,500 డాలర్ల జరిమానా చెల్లించి, కోర్టు అధికారుల ముందు లొంగిపోవాలని న్యాయస్థానం డెడ్‌లైన్ విధించడం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
అలాగే, ఒక అనుబంధ సంస్థలో షేర్లను కలిగి ఉన్న 'బీఆర్ ఇన్వెస్ట్‌కో ప్రైవేట్ లిమిటెడ్' (Beeaar Investco Pte) అనే కార్పొరేట్ సంస్థపై తనకు ఉన్న యాజమాన్య హక్కులను నిరూపించే పత్రాలను సమర్పించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసులో ఖతార్ హోల్డింగ్స్ తరపున 'డ్రూ & నేపియర్' (Drew & Napier) వాదించగా, బైజూస్ ఇన్వెస్ట్‌మెంట్స్ తరపున 'ఫెర్వే' (Ferve) ప్రతినిధులు హాజరయ్యారు.
ఎన్‌డీటీవీ ప్రకారం సింగపూర్ కోర్టు జైలు శిక్ష విధించిన కొన్ని గంటలకే, తనపై వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, ఏకపక్షంగా ఉందని బైజూస్ వ్యవస్థాపకుడు కొట్టిపారేశారు. సింగపూర్ కోర్టు వ్యవహారాన్ని తనను, ఇతర వ్యవస్థాపకులను తప్పుగా చిత్రీకరించేలా ప్రసారం చేయడంపై తాను తీవ్ర నిరాశకు లోనయ్యానని రవీంద్రన్ ప్రకటించారు. తన వైపు నుండి గానీ, లేదా ఇతర వ్యవస్థాపకుల వైపు నుండి గానీ ఎలాంటి తప్పు జరగలేదని స్పష్టం చేశారు. రుణదాతలతో ఇప్పటికే సెటిల్మెంట్ చర్చలు జరుగుతున్నందున, గత కొన్ని నెలలుగా తాను పలు కోర్టు విచారణల్లో క్రియాశీలకంగా పాల్గొనడం లేదన్నారు
ఆయన తెలిపిన వివరాల ప్రకారం... గ్లాస్ ట్రస్ట్ (GLAS Trust) మరియు ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (QIA) కి చెందిన సంస్థలతో సహా పలువురు రుణదాతలు కొంతకాలంగా వ్యవస్థాపకులతో చర్చలు జరుపుతున్నారు. సెటిల్మెంట్‌పై ప్రాథమికంగా ఒక అవగాహన కుదిరింది, కేవలం కొన్ని చిన్నపాటి సమస్యలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలి ఉన్న ఆ విషయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇది అనవసరమైన చట్టపరమైన ఒత్తిడి అని విమర్శించారు. వివాదాస్పద నిధులకు సంబంధించిన ఆరోపణలను కూడా రవీంద్రన్ తోసిపుచ్చారు. ఆ డబ్బును తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ వాడలేదని, ఆ నిధులన్నీ చట్టబద్ధమైన వ్యాపార ప్రయోజనాల కోసమే ఉపయోగించినట్టు నొక్కి చెప్పారు. తానెపుడూ బైజూస్ ఉద్యోగులు, విద్యార్థులు ,వాటాదారుల (stakeholders) ప్రయోజనాల కోసమే సద్భావనతో పని చేశానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : బైజూస్ ఫౌండర్‌కి జైలు శిక్ష, జరిమానా!
ఒక వెలుగు వెలిగిన బైజూస్
ఒకప్పుడు భారతదేశపు అతిపెద్ద స్టార్టప్ కంపెనీగా, అద్భుతమైన సక్సెస్ స్టోరీలలో ఒకటిగా ప్రశంసలు పొందింది. గ్లోబల్ ఇన్వెస్టర్ల నుండి బిలియన్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. అంతేకాదు, ఒకానొక సమయంలో దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్‌గా అవతరించింది. కానీ గత రెండేళ్లుగా, ఆర్థిక నివేదికల సమర్పణలో ఆలస్యం, ఉద్యోగుల తొలగింపులు (layoffs), మేనేజ్‌మెంట్ లోపాలు, 1.2 బిలియన్ల డాలర్ల రుణాన్ని రికవరీ చేయడానికి రుణదాతలు వేసిన కేసులతో కంపెనీ తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. రుణదాతలు తమ నిధులను రికవరీ చేసే ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో, రవీంద్రన్ ఇప్పుడు సింగపూర్ అమెరికా సహా పలు దేశాల్లో చట్టపరమైన విచారణలను ఎదుర్కొంటున్నారు.బైజూస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టిన ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి చెందిన ఒక అనుబంధ సంస్థ ఈ సింగపూర్ కోర్టు ప్రక్రియను ప్రారంభించింది. వరుస వివాదాలు, రుణాల ఎగవేత ఆరోపణలతో సంక్షోభంలో పడిపోయిన బైజూ రవీంద్రన్ తాజా పరిణామం మరింత షాక్ ఇచ్చింది.


