
ట్యుటికోరిన్: భారతీయ ఎగుమతులపై అమెరికా భారీ టారిఫ్‌ల ప్రభావాలపై ఆందోళన నెలకొన్నప్పటికీ.. సముద్ర మార్గంలో సరుకు రవాణా తగ్గలేదని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. భారతీయ మారిటైమ్ రంగం అసాధారణ స్థాయిలో పురోగమిస్తోందని పేర్కొన్నారు.
తమిళనాడులో వీవోసీ పోర్టులో గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభంతో పాటు ఇతరత్రా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఆగస్టు 27 నుంచి భారత ఎగుమతులపై సుంకాలను అమెరికా 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దీనితో ఎగుమతులపై ప్రభావం పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఏప్రిల్–జూలై మధ్యకాలంలో అమెరికాకు భారత ఎగుమతులు 22 శాతం పెరిగి 33.53 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 12 శాతం పెరిగి 17.41 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ వ్యవధిలో భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిల్చింది.