
కొత్త వాహనాలపై ఇస్తే పరిశ్రమకే ప్రయోజనం
జీఎస్‌టీపరంగా కూడా ఊరటనివ్వాలని ప్రధానిని కోరాను
సియామ్ కార్యక్రమంలో మంత్రి గడ్కరీ వెల్లడి
న్యూఢిల్లీ: పాత వాహనానికి సంబంధించిన స్క్రాపేజీ సర్టిఫికెట్ ఇచ్చే కస్టమర్లకు, కొత్త వాహనాలపై మరిన్ని డిస్కౌంట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆటోమొబైల్ పరిశ్రమకు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. అలాగే, పాత వాహనాన్ని తుక్కు కింద మార్చి (స్క్రాప్) కొత్తవి కొంటున్న వారికి, జీఎస్‌టీని కొంత తగ్గించడం రూపంలో కూడా ఊరట కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని కోరినట్లు ఆయన చెప్పారు.
భారతీయ ఆటోమొబైల్స్ తయారీ సంస్థల సంఘం సియామ్ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. స్క్రాపేజీ పాలసీ అనేది ఇటు పరిశ్రమకు అటు ప్రభుత్వానికి కూడా ప్రయోజనకరమైనదని గడ్కరీ చెప్పారు. ‘‘ఇది పరిశ్రమకే మేలు చేస్తుంది. కానీ పరిశ్రమ నా మాట ఇంకా పూర్తిగా వినడం లేదు. కొత్త వాహనాన్ని కొనేందుకు, పాతదాన్ని స్క్రాప్ చేసిన వారికి బాగా డిస్కౌంట్లు ఇస్తే, మీ టర్నోవరే భారీగా పెరుగుతుంది.
ప్రభుత్వానికి కూడా జీఎస్‌టీ వస్తుంది. దేశంలో కాలు ష్యం తగ్గుతుంది. కాబట్టి దీనికి మీరు కూడా ఇందు కు తప్పకుండా తోడ్పడాలి’’ అని గడ్కరీ చెప్పారు. ఇటీవల వస్తు, సేవల పన్నులను (జీ ఎస్టీ) క్రమబదీ్ధకరించడం వల్ల ఆటో రంగానికి భారీగా లబ్ధి చేకూరిందని, పరిశ్రమకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ‘‘మన ఆటో పరిశ్రమ ఇప్పుడు పరిమాణంపరంగా నంబర్ 3గా ఎదిగింది. మనం అంతా కలిసి పని చేస్తే తప్పకుండా ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకోగలం’’ అని గడ్కరీ వివరించారు.
తుక్కు రీసైక్లింగ్‌తో ఉద్యోగాలకు దన్ను..
తుక్కును రీసైక్లింగ్ చేసే ప్రక్రియ కారణంగా అదనంగా 70 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని గడ్కరీ చెప్పారు. అలాగే ఉక్కు, సీసం, అల్యుమినియం, ప్లాటినం, పల్లాడియం లాంటి లోహాల లభ్యత కూడా పెరగడం వల్ల దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని తెలిపారు. వాహనాలన్నింటినీ స్క్రాప్ చేసి అదనంగా కొత్త వాహనాలను కొనుగోలు చేయడం వల్ల జీఎస్‌టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి రూ. 40,000 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని గడ్కరీ చెప్పారు. స్క్రాపింగ్ తర్వాత ఏర్పడే అదనపు డిమాండ్‌తో ఆటోమొబైల్ పరిశ్రమ కూడా ప్రయోజనం పొందుతుందన్నారు. ప్రస్తుతం ప్రతి నెలా సగటున 16,830 వాహనాలను తుక్కు కింద మారుస్తుండగా, ప్రైవేట్ రంగం రూ. 2,700 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని ఆయన చెప్పారు.
ఈ–20పై అవాస్తవాలు..
ఈ20 ఇంధనంతో వాహనాల మైలేజీ తగ్గుతుందని, ఇంజిన్ పాడవుతుందని ఆందోళనలు వ్యక్తమవుతుండటంపై స్పందిస్తూ, అవన్నీ అవాస్తవాలే అని గడ్కరీ కొట్టిపారేశారు. దిగుమతులను తగ్గించుకునేందుకు ఇథనాల్ ఉపయోగపడుతుందని, దీని వల్ల కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన చెప్పారు. దీనితో రైతులకు రూ. 45,000 కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందన్నారు. కాలుష్య నియంత్రణకు సంబంధించి దేశీయంగా అంతర్జాతీయ ప్రమాణాలను అమలు చేస్తామని మంత్రి చెప్పారు.
పరిశ్రమకు జీఎస్‌టీ బూస్ట్..
వాహనాలపై జీఎస్‌టీ రేట్ల తగ్గింపు దేశీ ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధికి మరింత దోహదపడుతుందని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. దీనితో రేట్లు తగ్గి, ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ వాహనాలు మరింతగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తొలిసారిగా వాహనాలు కొనుగోలు చేస్తున్న వారికి, మధ్య స్థాయి ఆదాయవర్గాలకు గణనీయంగా ప్రయోజనం లభిస్తుందని చంద్ర వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీ మార్కెట్లోను, అలాగే ఎగుమతులపరంగాను భారతీయ ఆటో పరిశ్రమ స్థిరమైన పనితీరు కనపర్చిందని చెప్పారు. ప్యాసింజర్ వాహనాల విభాగంలో 2 శాతం వార్షిక వృద్ధితో, అత్యధికంగా 43 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదైనట్లు వివరించారు. ద్విచక్ర వాహనాల విభాగం కూడా కోలుకుంటోందని 9.1 శాతం వృద్ధితో 1.96 కోట్ల విక్రయాలు నమోదయ్యాయని చంద్ర చెప్పారు.